ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం ఇక ఎవరి తరమూ కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. బూర్జువ పార్టీలయిన కాంగ్రెస్, టీడీపీ తెలంగాణపై చేసిన తీర్మానాలకు కట్టుబడకుండా మాట మార్చాయని విమర్శిం చారు. సీపీఐ 88వ ఆవిర్భావ దినోత్సవరం సందర్భంగా స్థానిక రిక్కాబజార్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాం గ్రెస్, టీడీపీ అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీకి పంపిస్తే దానిపై చర్చించి అభిప్రాయం చెప్పకుండా, రాష్ట్రపతి, పార్లమెంట్, చట్టసభల పట్ల ఆ పార్టీల సభ్యులు అమర్యాదగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
చట్టాలపై తమకు నమ్మకం లేకపోయినా ఆమోదించామని, ఆ చట్టాల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. ఈ విషయంలో మాటకు కట్టుబడి ఉన్నదని కమ్యూనిస్టులేనని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొందని, ఏ నాయకుడు ఎప్పుడే పార్టీలో ఉంటాడో తెలియడం లేదని విమర్శించారు. ఒక విధానానికి కట్టుబడకుండా తమ స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమం పెరిగితే అవకాశవాదాన్ని అరికట్టవచ్చని చెప్పారు. గతంలో నరేంద్రమోడీని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ జపం చేస్తున్నారని, ఆయన అడ్రస్ కేరాఫ్ బీజేపీ కార్యాలయంగా మారిందని ఎద్దేవా చేశారు. లౌకిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేందుకు అనేక పార్టీలు కుట్ర పన్నాయన్నారు.
హిందువులను రెచ్చగొట్టడం ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కమ్యూనిస్టు పార్టీలతోనే లౌకికవాద మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థలో అతితక్కువ వేతనం తీసుకుంటున్న హోంగార్డులే ఎక్కువగా కష్ట పడుతున్నారని, వారి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. కోట్ల రూపాయల విలువైన భూములను స్వాహా చేసిన వారిని వదిలి, నిలువనీడ కోసం ప్రభుత్వ స్థలంలో పేదలు గుడిసె వేసుకుంటే దౌర్జన్యంగా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. దున్నే వాడికే భూమి కావాలని కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమించాయని, ఎందరో వీరులు ప్రాణ త్యాగాలు చేశారని, మరికొందరు జైలు పాలయ్యారని చెప్పారు.
నల్లమల గిరిప్రసాద్, రజబ్‌అలీ, యూనియన్ కొమరయ్య తదితరులు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. జిల్లాలో అవినీతి పెచ్చుమీరిందని, ఎవరి వాటాలు వారికి అందుతున్నాయని, దీనిలో అధికారులు కూడా ఉన్నారని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిద్ది వెంకటేశ్వర్లు, కొత్తగూడెం, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, బానోత్ చంద్రావతి తదితరులు మాట్లాడుతూ పేదల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని, వారి ఆశయాల సాధన కోసం పత్రి కార్యక ర్త పని చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి. సభలో సీపీఐ జిల్లా నాయకులు పోటు ప్రసాద్, ఎండి.మౌలానా, ఎస్‌కె.సాబీర్‌పాషా, మిరియాల రంగయ్య, రావులపల్లి రాంప్రసాద్, మేకల సంగయ్య, పోటు కళావతి, దండి సురేష్, సింగు నర్సింగరావు, బరిగెల సాయిలు, జమ్ముల జితేందర్‌రెడ్డి, ఎండి.సలాం, జక్కుల లక్ష్మయ్య, మందడపు నాగేశ్వరరావు, తిరుమలరావు, యలమంచిలి కృష్ణ, దొండపాటి రమేష్ పాల్గొన్నారు.
‘తెలంగాణ’ను ఎవరూ ఆపలేరు
Published Fri, Dec 27 2013 5:41 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement