నామినేషన్లకు శ్రీకారం | Nominations unveiled | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు శ్రీకారం

Published Sun, Apr 13 2014 2:13 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

Nominations unveiled

  • తొలిరోజు నామమాత్రం
  •  జిల్లాలో ఎంపీకి 3, ఎమ్మెల్యే స్థానాలకు7 దాఖలు
  •  16, 17న కుదరనున్న ముహూర్తాలు!
  •  సాక్షి, మచిలీపట్నం : సార్వత్రిక ఎన్నికల ఘట్టం శనివారం మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభించారు. తొలిరోజు నామమాత్రంగానే నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలకు మూడు నామినేషన్లు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్‌లను అభ్యర్థులు దాఖలు చేశారు. వారిలో పిరమిడ్ పార్టీకి చెందిన అభ్యర్థులే అత్యధిక నామినేషన్లు వేశారు. మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.రఘునందన్‌రావుకు, విజయవాడ లోక్‌సభ స్థానానికి రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ జె.మురళీకి ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు అందజేశారు.
     
    నామినేషన్లు వేసిన అభ్యర్థులు వీరే...
     
    విజయవాడ లోక్‌సభ స్థానానికి గుండపనేని రాజకుమారి (పిరమిడ్ పార్టీ), కొంగర సాయి (స్వతంత్ర), మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి వాడపల్లి రఘురాం (పిరమిడ్ పార్టీ) నామినేషన్‌లు వేశారు. తిరువూరు నియోజకవర్గానికి కుంచె వెంకటరమణ (జై సమైక్యాంధ్ర), దుబ్బాక నాగమోహన్ (స్వతంత్ర) నామినేషన్లు దాఖలు చేశారు. నూజివీడుకు గుడివాడ నాగరాజు (పిరమిడ్ పార్టీ), మచిలీపట్నానికి వడ్డి విజయసారథి (పిరమిడ్ పార్టీ), అవనిగడ్డకు సోమిశెట్టి వెంకట రత్తయ్య (పిరమిడ్‌పార్టీ), విజయవాడ సెంట్రల్‌కు సూరిశెట్టి వరప్రసాద్ (కాంగ్రెస్), మైలవరానికి బాలిన వెంకటరమణ (పిరమిడ్ పార్టీ)లు నామినేషన్లు వేశారు.

    ముహూర్తం ముందరున్నది...
     
    లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్‌ల గడువు ఈ నెల 12 నుంచి 19 వరకు ఉంది. ఈ నెల 13, 14, 18 తేదీలు సెలవు కావడంతో ఆ రోజుల్లో నామినేషన్లు స్వీకరించరు. మిగిలిన ఐదు రోజుల్లోనే జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఈ నెల 16, 17 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో ఆ రెండు రోజుల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
     
    జిల్లాలో ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థులు అన్నీ బాగున్నా ముహూర్త బలం కూడా ఉండాలనే గట్టి నమ్మకంతో మంచి ముహూర్తం చూసుకుని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ నెల 16, 17 తేదీల్లో పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది.
     
    16న ఉదయభాను నామినేషన్

     జగ్గయ్యపేట : వైఎస్సార్‌సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఈ నెల 16న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తన్నీరు నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. ఆరోజు ఉదయం 10 గంటలకు ఉదయభాను ఇంటి వద్ద నుంచి కార్యకర్తలతో ర్యాలీగా బయల్దేరి తహశీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని అందజేస్తారని వివరించారు. నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలిరావాలని ఆయన కోరారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement