సాక్షి, చిత్తూరు: రాత్రి ఎనిమిదయింది. అందరూ భోంచేసి రామన్న ఇంటిముందర అరుగుమింద కూర్చొని కబుర్లు చెప్పుకోడానికి వస్తున్నారు. ఆడ కూర్చుంటే రామన్న ఇంట్లో టీవీ కనబడతా ఉంటాది. రామన్న కొడుకులు బెంగళూరులో సెటిలయ్యారు. ఆ ఇంట్లో మొగుడూపెళ్లాలే ఉంటారు. న్యూస్ చానల్ పెట్టుకుంటే అడ్డు చెప్పేవాళ్లుండరు. అందుకే అందరూ అక్కడికొస్తారు. ఎవరన్నా రాకుంటే గట్టిగా పిలిచి అరుగుమీదకు రప్పించుకుంటారు.
చిత్తూరు నుంచి అమెరికా రాజకీయాల వరకు అన్నీ మాట్లాడేస్తుంటారు. ముసిలోళ్లయినా మహా గట్టోళ్లు. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలకే పరిమితమయ్యారు. ఇప్పుడు పదవిలో ఉండే ఆయప్పది వాళ్ల పక్కూరే. సదువుకునేకి చిన్నప్పుడు రామన్న వాళ్లూరికే వస్తుండేవాడు. అప్పుడే టీవీలో బ్రేకింగ్ వస్తోంది. సౌండ్ వినపడట్లేదు ‘సౌండ్ పెంచరా రామన్న’ అంటూ ఒకటే గోల ముసలోళ్లంతా. బ్రేకింగ్ ఏమంటే.. చిన్నబ్బాయికి ఫలానా చోట సీట్ ఖరారయిందని.
‘ఏందిరా రామన్నా ఈ దరిద్రపుగొట్టు వార్త. మూడు రోజుల నుంచి ఇదే బ్రేకింగు’ యాష్టపోయాడు వెంకన్న. ‘ చిన్నబ్బాయి తండ్రి ఎప్పుడన్నా.. రాష్ట్రానికి మంచి చేసినాడారా.. అక్కడిదాకా ఎందుకు మనూరికి మంచి చేసినారా? ఎంత సేపూ వాళ్ల కాళ్లు లాగుదాం.. వీళ్ల కాళ్లు లాగుదాం అనే ఆలోచనే కదరా ఆయప్పది’ అన్నాడు వెంకన్న. ‘ఊరిదాకా ఎందుకబ్బా.. ఆయప్ప చదివింది మనూరి స్కూళ్లోనే కదా.. పడిపోతా ఉంది.. కట్టించొచ్చు కదా’ చేతూలూపుతూ అన్నాడు రామన్న. ‘ఊరుకో రా.. ఆయన అమరావతి కట్టడంలో బిజీగా ఉన్నాడంట’ జోకేశాడు సుబ్బు.
‘ఆ.. ఆ కడతాడు చిన్న స్కూలు కూడా కట్టనోడు.. అమరావతి కడతాడంట’ అన్నాడు వెంకన్న. ‘2014లో కుర్చీ ఎక్కినప్పటి నుంచి గ్రాఫిక్స్ చూపిస్తానే ఉండాడు అంటూ ఇంటికి కదిలాడు సుబ్బు. ఈ సారి కూడా చిన్నబ్బాయి తండ్రికి ఓటేస్తే కొండకు కట్టెలు మోసినట్టే.. గొణుక్కుంటూ టీవీ ఆఫ్ చేశాడు రామన్న.
Comments
Please login to add a commentAdd a comment