‘కరెంట్‌ షాక్‌’లకు స్వస్తి! | Not Increased electricity charges in debts also | Sakshi
Sakshi News home page

‘కరెంట్‌ షాక్‌’లకు స్వస్తి!

Published Thu, Dec 5 2019 4:21 AM | Last Updated on Thu, Dec 5 2019 4:21 AM

Not Increased electricity charges in debts also - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు 98 శాతం మంది విద్యుత్‌ వినియోగదారులపై చార్జీల భారం పడకుండా అప్పుల నుంచి బయటపడే ప్రతిపాదనలను డిస్కమ్‌లు విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి సమర్పించాయి. ఈమేరకు 2020–21 వార్షిక ఆదాయ అవసర నివేదికలను (ఏఆర్‌ఆర్‌) ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) అందచేశాయి. ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి నేతృత్వంలో తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి సెల్వరాజన్, హరినాథ్‌రావు ఏఆర్‌ఆర్‌ ప్రతులను బుధవారం హైదరాబాద్‌లో విద్యుత్‌ నియంత్రణ మండలి కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డికి అందజేశారు. ఏఆర్‌ఆర్‌లపై ఏపీఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి మార్చి 31వ తేదీన కొత్త టారిఫ్‌ ప్రకటిస్తుంది. ఇది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది.  

నెలకు 500 యూనిట్లు దాటినవారిపై మాత్రమే...
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.44,840.96 కోట్ల మేర ఆర్థిక వనరులు కావాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. ప్రస్తుతం టారిఫ్‌ రూపంలో రూ.30,399.72 కోట్ల ఆదాయం లభిస్తుండగా మరో రూ.14,441.24 కోట్లు అవసరమని తెలిపాయి. ఈ లోటు పూడ్చుకునేందుకు కొన్ని వర్గాలపై చార్జీల పెంపు ద్వారా రూ.1,373.27 కోట్లు రాబట్టకునేందుకు కమిషన్‌ అనుమతి కోరాయి. అయితే దాదాపు 98 శాతం మంది విద్యుత్‌ వినియోగదారులపై ఈ పెంపు ప్రభావం ఉండదు. నెలకు 500 యూనిట్ల విద్యుత్‌ వినియోగం దాటిన వారిపై మాత్రమే యూనిట్‌కు 90 పైసలు చొప్పున పెంపు ఉండేలా డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలపై స్వల్పంగా విద్యుత్‌ భారం పడనుంది. మిగిలిన రూ.13,067.97 కోట్ల లోటుకు సంబంధించి ఉచిత విద్యుత్, ఇతర వర్గాలకు ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం అందిస్తుందని డిస్కమ్‌లు అంచనా వేస్తున్నాయి.  

పెంపులేని ప్రతిపాదనలు.. 
‘పేదలు, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతిపై ఒక్కపైసా కూడా విద్యుత్‌ భారం మోపలేదు. శ్లాబుల వర్గీకరణ పేరుతో కానరాని భారాన్ని వేయలేదు. అప్పుల భారం వెంటాడుతున్నా ప్రజలకు ఇబ్బంది కలగించకూడదన్న ప్రభుత్వ లక్ష్యాన్నే అనుసరించాం. దాదాపు 98 శాతం వినియోగదారులకు ప్రయోజనం కలిగించాం’  
– శ్రీకాంత్‌ నాగులపల్లి

డిస్కమ్‌ల ప్రతిపాదనలు ఇవీ
- గతంలో శ్లాబుల వర్గీకరణ పేరుతో పరోక్షంగా ప్రజలపై భారం పడింది. విద్యుత్తు వాడకందారులను 900 (ఏ), 900–2700 (బి), 2700 ఆపై యూనిట్లు వినియోగించే వారిని ‘సి’ కేటగిరీలుగా విభజించారు. పొరపాటున ఒక్క యూనిట్‌ ఎక్కువైనా ఏడాది పొడవునా అధిక విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి వచ్చేది. ఈ విధానాన్ని ఇప్పుడు ఎత్తివేశారు. నెలకు 75 యూనిట్ల వరకు (ఏ), 75–225 (బి), 225 ఆపైన (సి) కేటగిరీలుగా పరిగణిస్తారు. పెరిగిన నెలకు మాత్రమే బిల్లు చెల్లించేలా మార్పు చేశారు.  

టౌన్‌షిప్‌లు, కాలనీలు (హెచ్‌టీ–1) కేటగిరీలకు రూ. 6.30 నుంచి రూ. 7కి  పెంచాలని ప్రతిపాదించారు.  

అడ్వర్టైజింగ్, హోర్డింగ్, ఫంక్షన్‌ హాల్స్‌కి రూ. 11.75 నుంచి రూ. 12.25కి పెంచాలని ప్రతిపాదన. 

- పర్యాటకం, ఇతర వాణిజ్య అవసరాలకు రూ. 6.95 నుంచి రూ. 7.35కి పెంపు ప్రతిపాదన. 

- స్థానిక సంస్థలు ఇక నుంచి యూనిట్‌కు రూ.7 చొప్పున చెల్లించాలని ప్రతిపాదించారు. 

- ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యాలయాల నుంచి ఫిక్స్‌డ్‌ చార్జీల కింద నెలకు రూ. 475 చొప్పున వసూలు ప్రతిపాదన. 

- రైల్వే శాఖకు విద్యుత్‌ టారిఫ్‌ యూనిట్‌ రూ. 3.75 నుంచి రూ.6.70కి పెంచాలి. 

- హార్టీకల్చర్, ఫ్లోరీ కల్చర్‌కు యూనిట్‌ రూ. 3.85 నుంచి రూ. 4.50కి పెంచాలి. 

- ఎత్తిపోతల పథకాలకు యూనిట్‌ రూ. 5.80 నుంచి రూ.7.15కి పెంచి వసూలు చేయాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement