
పెద్ద నోట్ల రద్దుతో తగ్గిన ఆర్టీసీ ఆదాయం
► ఆదాయం పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు
► రీజియన్ కు 150 కొత్త బస్సులు
► ఆర్టీసీ రీజియన్ మేనేజర్ ఆదాం సాహెబ్
చీరాల అర్బన్ : పెద్ద నోట్ల రద్దుతో ఆర్టీసీకి ఆదాయం తగ్గిన మాట వాస్తవమేనని, ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకున్నట్లు ఆర్టీసీ రీజియన్ మేనేజర్ ఆదాం సాహెబ్ అన్నారు. సాధారణ పరిశీలనలో భాగంగా గురువారం చీరాల వచ్చిన ఆయన ముందుగా ఆర్టీసీ డిపో గ్యారేజీని పరిశీలించి అక్కడి వారితో మాట్లాడారు. అనంతరం బస్టాండ్‌లోని డిపో మేనేజర్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. డిపోలోని సర్వీసుల వివరాలు, ఆదాయాలపై రికార్డులను తనిఖీ చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో 10 శాతం మేర తగ్గిందని, చిల్లర సమస్యతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారన్నారు. అయితే ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించామని చెప్పారు. ఆర్టీసీకి ఆదాయం తగ్గిపోయే రూట్లలో పోలీస్, రవాణాశాఖ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు ఆరుగురు ఎస్‌ఐలను ఆర్టీసీకి కేటాయించారన్నారు.
వీరి సహకారంతో ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచుతున్నట్లు చెప్పారు. అలానే జిల్లాకు 150 కొత్త బస్సులు వచ్చాయని, వీటిలో 110 సూపర్‌లగ్జరీలు, డీలక్స్‌లు 20, ఎక్స్‌ప్రెస్‌లు 20 బస్సులు వచ్చాయన్నారు. వీటిలో చీరాలకు ఎనిమిది సూపర్‌లగ్జరీ బస్సులు కేటాయించామన్నారు. వీటిని షాపూర్, హైదరాబాద్ సర్వీసులకు వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులకు చిల్లర కష్టాలు తగ్గించేందుకు ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముందుగా రిజర్వేషన్ కౌంటర్లలో ఏర్పాటు చేశామని, తర్వాత గ్రౌండ్ బుకింగ్ కౌంటర్లు, కార్గోలలో, దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులలో స్వైపింగ్ మెషిన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రెండేâýæ్ల కాలంలో ఆర్టీసీలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని, ఆర్టీసీ బస్టాండ్ల నవీకరణ, కొత్త బస్సులు వంటివి వచ్చాయన్నారు. సిబ్బంది కూడా ఆదాయం పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రయాణికులు లేకుంటే ఆర్టీసీనే ఉండదని, సంస్థ అభివృద్ధికి అందరూ పాటుపడాలన్నారు. ఆయన వెంట డిపో మేనేజర్ డి.శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ జి.శ్యామల, ఎస్‌టీఐ రవివర్మ, తదితరులు ఉన్నారు.