ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవికి అర్హులైనవారి కోసం అన్వేషణ మెదలైంది. రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించే ప్రక్రియను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రారంభించింది. వీటిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా ఉంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉపకులపతి పదవులకు అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రా వర్సిటీకి ప్రస్తుత వీసీగా(అదనపు బాధ్యతలు) వ్యవహరిస్తున్న ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి.. బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోనే పాలనలో తనదైన ముద్ర వేశారు. రెక్టార్‌గా, రిజిస్ట్రార్‌గా గతంలో పని చేసిన అనుభవంతో స్వల్పకాలంలోనే పలు మార్పులు చేసి వ్యవస్థను గాడిలో పెడుతున్నారు. రెగ్యులర్ వీసీ పదవికి ఆయన కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతిగా ఇటీవలి వరకు పనిచేసిన ఆచార్య జి.నాగేశ్వరరావు పదవీ కాలం గత నెల 16న ముగిసింది. ఆయన స్థానంలో పూర్తిస్థాయి వీసీని నియమించాల్సి ఉంది. అంతవరకు తాత్కాలిక ఏర్పాటుగా ఏయూ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ఆచార్యుడు పి.వి.జి.డి ప్రసాదరెడ్డికి వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా రెగ్యులర్ వీసీ నియామక ప్రక్రియ మొదలుకావడంతో వర్సిటీలో సందడి నెలకొంది.
సెర్చ్ కమిటీ..
వీసీ నియామకానికి ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఇందులో సంబంధిత వర్సిటీ నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, గవర్నర్ నామినీ ఒకరు సభ్యులుగా ఉంటారు. అందిన దరఖాస్తులను ఈ కమిటీ వడపోసి అర్హుడైన ఆచార్యుడి పేరును సిఫార్సు చేస్తుంది. ప్రభుత్వం, గవర్నర్ ఆమోదం పొందిన తరువాత ఆ అభ్యర్థిని వీసీగా నియమిస్తారు. ఈ ప్రక్రియకు కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. సెప్టెంబరు 17తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. అనంతరం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, వడపోత ప్రారంభమవుతుంది. ఇందుకోసం సెర్చ్ కమిటీ పలుమార్లు భేటీ అవుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆమోదం, గవర్నర్ ఆమోదముద్ర పొందడానికి మరో నెల పడుతుంది. మొత్తం మీద డిసెంబర్ నాటికి వీసీల నియామకం పూర్తి అయ్యే అవకాశముంది.
ఇతర వర్సిటీలకు ఏయూ ఆచార్యులే..
ఏయూతోపాటు పద్మావతి మహిళావర్సిటీ, ఆదికవి నన్నయ, ఆచార్య నాగార్జున, కృష్ణా, యోగి వేమన వర్సిటీలకు వీసీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏయూ ఆచార్యులు ఏయూతో పాటు ఆచార్య నాగార్జున, కృష్ణా, నన్నయ, పద్మావతి మహిళా వర్సిటీ పోస్టులకు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెసర్‌గా పదేళ్లకు పైగా అనుభవం ఉన్నవారు ఏయూలో అధికంగా ఉన్నారు. వీరంతా వీసీ పదవికి పోటీ పడనున్నారు. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలకు ఏయూ ఆచార్యులే వీసీలుగా ఉన్నారు. కొత్త పదవుల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలువురు ఆ చార్యులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వీసీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రసాదరెడ్డి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
నెల రోజుల్లోనే ప్రసాదరెడ్డి ముద్ర..
ప్రస్తుతం ఏయూ వీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆచార్య ప్రసాద రెడ్డి నెలరోజుల్లోనే తనదైన ముద్ర వేశారు. గతంలో రిజిస్ట్రార్‌గా, రెక్టార్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఎంతో కలిసి వస్తోంది. తనదైన శైలిలో విద్యార్థుల సంక్షేమమే ప్రధానంగా ఆయన సేవలు అందిస్తున్నారు. వర్సిటీ ఇంజినీరింగ్ వర్క్స్‌పై ప్రత్యేక కమిటీ వేసి ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నారు. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పరీక్షల రీ వాల్యుయేషన్ సమస్యలను వారం రోజుల్లోనే పరిష్కరించారు. వర్సిటీ ఆర్థిక సమస్యల నేపథ్యంలో నూతన వసతిగృహాల నిర్మాణానికి పలువురు దాతలను ఇప్పటికే సమీకరించారు. వర్సిటీ ఆర్థిక పరిస్థితిని బలోపేతంచేస్తూనే..నిధులు దుర్వినియోగం కాకుండా అవసరమైన మేరకే నిధులు ఖర్చుచేస్తున్నారు. నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా పేరున్న ప్రసాదరెడ్డి గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో నాటి వీసీ ఆచార్య బీల సత్యనారాయణతో సమన్వయం చేసుకుంటూ పాలన సాగించారు. వర్సిటీ ఉద్యోగులతో సత్సంబంధాలు ఉండటంతో తనదైన ముద్ర వేశారు.
Comments
Please login to add a commentAdd a comment