అది ఒకప్పుడు ఓ కుగ్రామం. గాఢాంధకారంలో ఉండేది. జనసంచారం కూడా అంతంత మాత్రమే. కనీసం వీధి దీపాలు లేకుండా ఓ అడవిని తలపించేది. అదంతా గతం.ఇప్పుడా కుగ్రామం పగలు కన్నా రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల్లో ధగధగలాడుతోంది. అంతేకాదు.. మన రాష్ట్రంతో పాటు పక్కనే ఉన్న ఐదు రాష్ట్రాలకు ఎంతో అవసరమైన విద్యుత్ సరఫరా చేస్తూ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోంది. ఆ కుగ్రామం పరవాడ. ఈ వెలుగులుకు కారణం 22 ఏళ్ల కిందట ఏర్పాటైన సింహాద్రి జాతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రం(ఎన్టీపీసీ). భారీ పరిశ్రమ అంటే విశాఖ స్టీల్‌ప్లాంట్ తప్ప తెలియని పరవాడ ప్రజలకు తమ చెంత ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ కేంద్రం ఏర్పాటవుతున్నట్టు తమ కలలో కూడా ఊహించలేదు. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అడుగుపెట్టి అనతి కాలంలో అంచెంచెలుగా ఎదిగి 2వేల మెగావాట్ల సామర్థ్యానికి చేరుకున్న పరవాడ సింహాద్రి ఎన్టీపీసీ సోమవారం 23వ వసంతంలోకి అడుగుపెట్టనుంది.
సాక్షి, పరవాడ(పెందుర్తి): సింహాద్రి జాతీయ ధర్మల్ విద్యుత్ కేంద్రం(ఎన్టీపీసీ) 23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకోవడానికి ముస్తాబైంది. పరవాడ సమీపంలో 1997 జూలై 8న ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో ఎన్టీపీసీ ఆవిర్భవించింది. 3,400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎన్టీపీసీలో తొలి విడతగా రూ.3700 కోట్ల వ్యయంతో వెయ్యి మెగావాట్ల యూనిట్ల పనులను పూర్తి చేసింది. మలి విడతలో మరో రెండు 500 మెగావాట్ల యూనిట్లను ఏర్పాటు చేసి వెయ్యి మెగావాట్ల ఉత్పత్తికి 2007లో శంకుస్థాపన చేసింది. ఈ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని 2011 నాటికి పూర్తి స్థాయి ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు.
సేవలతో మమేకం
సామాజిక సేవల్లో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్వాసిత గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కల్యాణ మండపాలు, పాఠశాలలు, కళాశాలల భవనాలు, సీసీ రహదారులు, కాలువలు, వీధి దీపాలు, మినరల్ వాటర్ ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. వికలాంగ సంక్షేమం, మహిళలకు కుట్టు శిక్షణ, నిరుద్యోగ యువకులకు డ్రైవింగ్‌లో శిక్షణ, ఆస్పత్రుల అభివృద్ధి, సౌర విద్యుత్ కల్పన, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నారు.
మచ్చుకు కొన్ని..
► సీఎస్సార్ విభాగం ద్వారా 2018–19లో రూ.1.60 కోట్ల వ్యయంతో పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు భవన నిర్మాణం చేపట్టారు. సైన్స్ పరికరాలు, ఫర్నిచర్ వంటి సామగ్రిని సమకూర్చారు.
► వెన్నలపాలెంలో కోటి రూపాయల నిధులతో విశాలమైన కల్యాణ మండపాన్ని నిర్మించారు.
► రాష్ట్రంలో పలు తీర ప్రాంతాల్లో అంతరించిపోతున్న ఆలీవ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు రూ.5.6 కోట్లు వెచ్చించారు. ఈ నిధులను ఐదేళ్ల పాటు వాటి సంరక్షణ కోసం వినియోగిస్తారు.
► బాలిక సాధికారత కార్యక్రమంలో భాగంగా రూ.60 లక్షలు వెచ్చించి మండలంలో 125 మంది బాలికలకు నాలుగు వారాల పాటు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చారు.
► విశాఖలో దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ఫిజియోథెరఫీ సెంటర్లలో యంత్ర పరికరాలు సమకూర్చడానికి రూ.1.87 కోట్లను వెచ్చించారు.
‘మహారత్న’ంగా గుర్తింపు
అనతి కాలంలోనే రెండు వేల మెగావాట్ల సామర్థ్యానికి చేరుకున్న సింహాద్రి ఎన్టీపీసీ పలు రాష్ట్రాల ప్రజలకు వెలుగులు ప్రసాదిస్తూ ప్రగతి పథంలో పయనిస్తోంది. సంస్థకు వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని వెచ్చించి నిర్వాసిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంపకం వంటి పనులు చేపడుతూ అందరి మన్ననలు పొందుతూ ‘మహారత్న’ కంపెనీగా పేరు గాంచింది. భద్రత ప్రమాణాలు, పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తూ స్వర్ణశక్తి, గ్రీన్‌టెక్ సేఫ్టీ, ఇందిరా ప్రియదర్శిని, వృక్షమిత్ర వంటి అవార్డులను సింహాద్రి ఎన్టీపీసీ సొంతం చేసుకుంది.
ఇతర రాష్ట్రాలకు వెలుగులు
సింహాద్రి ప్లాంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్ఛేరి రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశంలో నాణ్యమైన విద్యుదుత్పాదనలో మేటిగా నిలిచి ‘మహారత్న’ కంపెనీ బిరుదును సొంతం చేసుకుంది.
బొగ్గు దిగుమతి ఇలా..
సింహాద్రి ఎన్టీపీసీలో విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును ఒడిశా, సింగరేణి, ఇండోనేషియా నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. రెండు వేల మెగావాట్ల విద్యుదుత్పతికి 30 వేల మెట్రిక్ టన్నుల బొగ్గును ఉపయోగిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటిని ఏలేరు కాలువ, ముత్యాలమ్మపాలెం సముద్రం నుంచి పైపులైన్ల ద్వారా తీసుకు వచ్చి వినియోగిస్తున్నారు.
తప్పని కాలుష్య కష్టాలు
పరిశ్రమలో ఏర్పాటు చేసిన చిమ్నీల ద్వారా ఎగిరిపడుతున్న బొగ్గు రేణువులతో సోమునాయుడుపాలెం, స్వయంభూవరం గ్రామాల ప్రజలు సతమతమవుతున్నారు. తమ గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
అందరి సహకారంతో ప్రగతి పథం
కార్మికులు, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజల సహకారంతో సంస్థ ప్రగతి పథంలో పయనిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, భద్రత ప్రమాణాలు, ఆరోగ్య పరిరక్షణ, సమయ పాలనలపై అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. కార్మిక భద్రత, కాలుష్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది శతశాతం బూడిదను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశాం. సీఎస్సార్ విభాగం ద్వారా కోట్లాది రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రహదారులు, మినరల్ వాటర్ ప్లాంట్లు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించాం. త్వరలో మరికొన్ని ఆర్వో ప్లాంట్లను ప్రారంభిస్తాం. భవిష్యత్‌లో గ్రామీణ ప్రాంతాలను మరింత ఆదర్శంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాం.
– వి.సుదర్శన్‌బాబు, సీజీఎం, సింహాద్రి ఎన్టీపీసీ
800 ఎకరాల్లో బూడిద చెరువుల ఏర్పాటు
ప్లాంటు నుంచి విడుదలైన ఫ్లైయాష్(బూడిద)ను నిల్వ చేయడానికి పిట్టవానిపాలెం సమీపంలో సుమారు 800 ఎకరాల్లో చెరువులను ఏర్పాటు చేశారు. ప్లాంట్ నుంచి విడుదలయ్యే బూడిదను పైపుల ద్వారా చెరువులకు తరలించి నిల్వ చేస్తున్నారు. ఈ బూడిద గాలికి ఎగరకుండా పింకలర్స్ ఏర్పాటు చేశారు. అయితే వాటి పనితీరు తూతూ మంత్రంగా ఉంది. ధూళి ఎగిరి పిట్టవానిపాలెం, దేవాడ, కలపాక, గొల్లలపాలెం, దలాయిపాలెం, స్వయంభూవరం, సోమునాయుడుపాలెం గ్రామాలను ముంచెత్తుతోంది. ఆయా గ్రామాల ప్రజలు వేసవి కాలంలో నరకయాతన అనుభవిస్తున్నారు. ఎన్టీపీసీ బూడిద వల్ల దలాయిపాలెంలో సాగు చేస్తున్న ఉప్పు మడులు దెబ్బతింటున్నాయి. పరిశ్రమ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాలు ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి చేరి మత్స్య సంపద నాశనమవుతుందని ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిక్కవానిపాలెం తీరంలో నిర్మించిన జెట్టీ, పిట్టవానిపాలెంలో ఏర్పాటు చేసిన బూడిద చెరువు
దేశంలో అతిపెద్ద జెట్టీ
సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంటులో ఏర్పాటు చేసిన బ్రాయిలర్లను చల్లార్చడానికి వీలుగా తిక్కవానిపాలెం సమీపంలోని సముద్రం నుంచి ఉప్పు నీటిని వినియోగిస్తున్నారు. ఇందు కోసం తీరంలో 1450 మీటర్ల పొడవైన పంప్ హౌస్‌ను నిర్మించారు. పంపుహౌస్ నుంచి సముద్రం నీటిని ప్లాంటుకు తరలించడానికి మూడు పంపులను ఏర్పాటు చేశారు. పంపుహౌస్‌లో సముద్రపు నీటిని తరలించడానికి 11 కేవీ మోటారును ఏర్పాటు చేసి ఒక్కొక్క పంపు ద్వారా గంటకు 90 లక్షల లీటర్ల సముద్రపు నీటిని సీడబ్ల్యూ పంప్ హౌస్‌కు పంపి కూలింగ్ టవర్లను చల్లార్చడానికి వినియోగిస్తున్నారు.
ప్లాంటులో ఈడీపీ పంప్‌హౌస్ నుంచి విడుదలైన వేడి నీటిని తీరానికి 750 మీటర్ల దూరంలో సముద్రంలో పంపు ద్వారా విడుదల చేస్తారు. ఇందు కోసం తిక్కవానిపాలెం తీరంలో 700 మీటర్ల లోపల దేశంలో ఎక్కడలేని అతి పెద్ద జెట్టీని నిర్మించారు. 275 మీటర్ల ఎత్తులో నిర్మించిన రెండు చిమ్నీలు ఆసియా ఖండంలోనే అతి పెద్దవి. 165 మీటర్ల ఎత్తులో నిర్మించిన నాలుగు కూలింగ్ టవర్లు దేశంలోనే పెద్దవి.
Comments
Please login to add a commentAdd a comment