ఆరోపణలపై విచారణకు ఆదేశించిన డీఎంఈ
ఒంగోలు సెంట్రల్: రిమ్స్‌లో నిర్వహిస్తున్న నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని అన్ని జీఎన్‌ఎం కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న నర్సింగ్ విద్యార్థులకు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకూ నర్సింగ్ పరీక్షలను రిమ్స్‌లోని వైద్య కళాశాలలో నిర్వహిస్తున్నారు. అయితే రిమ్స్‌లో నర్సింగ్ పరీక్షల కోసం ఒక్కో విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల వరకూ వసూలు చేసిన నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు, వీటిని రిమ్స్ నర్సింగ్ పరీక్షలు నిర్వహించే అధికారులకు అందజేసిన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలో వైద్యకళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ పరీక్షల సూపరింటెండెంట్‌గా ఉండటంతో కాపీయింగ్‌కు పెద్దగా అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతం ఆయన రాజీనామా చేయడంతో అధికారులు పని సులువైంది. మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యార్థులు 600 మంది, రెండో సంవత్సరం 383 మంది, మూడో సంవత్సరం విద్యార్థులు 370 మంది ప్రస్తుతం పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 1353 మంది రిమ్స్‌లో శుక్రవారం నుంచి పరీక్షలు రాస్తున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో కళాశాలల యాజమాన్యాలు వసూలు చేసి రిమ్స్ పరీక్షల అధికారులకు అందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం నర్సింగ్ రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో రిమ్స్ డైరక్టర్ డాక్టర్ అంజయ్య తనిఖీలకు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున తమ వద్ద ఉన్న కాపీలను చెత్త బుట్టలు, పక్కన ఉన్న బ్లాకుల్లో పడేశారు.
తనిఖీ అనంతరం విద్యార్థులు యథావిధిగా కాపీలు కొట్టినట్లు సమాచారం. అయితే నర్సింగ్ పరీక్షల అధికారిగా ఉన్న కేసీటీ నాయక్ ఈ ఆరోపణలపై స్పందిస్తూ బుట్టల్లో ఉన్న కాపీలో ప్రస్తుతం జరుగుతున్న నర్సింగ్ పరీక్షలవి కావని, గత వారం పరీక్షలు జరిగిన ఏఎన్‌ఎం విద్యార్థులవని తెలిపారు. ప్రస్తుత విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడటం లేదని, విద్యార్థుల వద్ద నుంచి ఎటువంటి నగదు వసూలు చేయలేదని చెప్పారు. ఇప్పటికే ఈ వివాదం హైదరాబాద్ వరకూ వెళ్లింది. దీనిపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ డాక్టర్ శాంతారావు, రిమ్స్ డైరక్టర్ అంజయ్యను ప్రశ్నించినట్లు సమాచారం. విజయవాడ సిద్దార్ధ వైద్య కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యకుమారిని విచారణాధికారిగా నియమించారు. ఆమె శనివారం ఒంగోలు వచ్చి ఈ మాస్ కాపీయింగ్‌పై విచారణ జరిపారు.
నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ?
Published Sun, Nov 30 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement