వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వెంటనే అధికారిక బులెటన్ విడుదల చేయాలని ఆ పార్టీ నేత సుజయ్ కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు.
హైదరాబాద్:రాష్ట్రానికి సమన్యాయం చేయాలంటూ చంచలగూడ జైల్లో దీక్ష చేపట్టిన వైఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వెంటనే అధికారిక బులెటన్ విడుదల చేయాలని ఆ పార్టీ నేత సుజయ్ కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు.జగన్ ఆరోగ్య పరిస్థితిపై కోట్లాది మంది అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అధికారిక బులిటెన్ విడుదల చేయకపోతే మరింత ఆందోళన చెందే అవకాశాలున్నాయని సుజయ్ కృష్ణ రంగారావు అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విభజన విషయంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్తో జగన్ ఆమరణదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్ష 5వ రోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నేతలు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక బులిటెన్ విడుదల చేయాలని జైలు అధికారులను కోరుతున్నారు.