పోలీసుల ఆధీనంలో తిరుపతిలోని చిన్న బజారు వీధి–పట్నూలు వీధి సర్కిల్
తిరుపతి తుడా : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో అధికార యంత్రాంగం మరింత పటిష్ట చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. బుధవారం నాటికి జిల్లాలో 5 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. గురువారం నాటికి ఆ సంఖ్య 9కి చేరింది. దీంతో జిల్లాలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌కు హాజరై వచ్చిన తిరుపతికి చెందిన ఓ యువకుడికి వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే శ్రీకాళహస్తికి చెందిన మరో వ్యక్తికి, రేణిగుంటకు చెందిన ఇంకోవ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లాలో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. ఇందులో శ్రీకాళహస్తి–3, పలమనేరు–2, ఏర్పేడు–1, గంగవరం–1, తిరుపతి–1, రేణిగుంటలో –1 కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. శ్రీకాళహస్తిలోని నాగచిపాళ్యం ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా హైఅలెర్ట్‌ను ప్రకటించి, ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని హెచ్చరికలు జారీచేస్తోంది.
విస్తృతంగా పారిశుధ్య పనులు
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతూ రాష్ట్రంలోనే మేటిగా నిలిచింది. అయితే దురదృష్టవశాత్తు తిరుపతిలో గురువారం తొలి కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం నగరంలో హైఅలెర్ట్ ప్రకటించి కట్టుదిట్టమైన భద్రతకు ఏర్పాట్లు చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ 36వ వార్డు త్యాగరాజనగర్‌కు చెందిన ఓ యువకుడు ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొని, గత నెల 24వ తేదీన తిరుపతికి చేరుకున్నాడు. అప్పటికే అప్రమత్తమైన యంత్రాంగం 25న ఉదయం ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని పాత ప్రసూతి ఆస్పత్రిలోని క్వారంటైన్‌కు తరలించారు. రక్తపరీక్షలు నిర్వహించగా ఆ యువకుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అతనితో పాటు కుటుంబ సభ్యులను ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచినట్లు కమిషనర్ గిరీష వెల్లడించారు.
ఆ వార్డులన్నీ రెడ్ జోన్లు
36వ వార్డుతో పాటు 32, 35, 37, 38 ఈ వార్డులను రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు ఆయన చెప్పారు. త్యాగరాజ నగర్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రాకుండా నిఘా పెంచారు. ఆ ప్రాంతంలో రసాయనాలు, బ్లీచింగ్, విస్తృతంగా చల్లుతున్నట్లు చెప్పారు. నగర ప్రజలు నిబంధనలను అతిక్రమించవద్దని హెచ్చరించారు. రేణిగుంటకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి వచ్చాడు. అతను లక్షణాలు ఉండడంతో ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు చేసిన వైద్యులు అతనికి పాజిటివ్ అని గురువారం నిర్ధారించారు. సాయంత్రం అతని కుటుంబ సభ్యులను క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment