
కర్నూలు(సెంట్రల్) : కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముందుగా నంద్యాలకు హెలికాప్టర్‌లో వచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉండగా కో ఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) సమాచారం తప్పుగా ఉండటంతో దాదాపు 10 నిమిషాల పాటు హెలికాప్టర్ గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కర్నూలు జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది.
దీంతో కలెక్టర్ జి.వీరపాండియన్ డీఆర్వో వెంకటేశంను విచారణాధికారిగా నియమించినట్లు తెలుస్తోంది. కోఆర్డినేట్స్ నివేదికను ల్యాండ్స్ అండ్ సర్వే విభాగం డిగ్రీలు, నిమిషాలు, సెకన్లలో ఇవ్వాలి. అది కూడా సీఎంవో అడిగిన రెండు ఫార్మాట్లలో పంపాలి. సర్వే డిపార్టుమెంట్‌కు చెందిన ఏడీ హరికృష్ణ ఈ పనిని నంద్యాల డివిజన్ డీఐ వేణుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన కేవలం ఒకే ఫార్మాట్‌లో అది కూడా 15, 4, 326 అని నివేదించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేటతెల్లమవుతోంది.