‘జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు...
- ప్రాజెక్టులు నిర్మించేస్తున్నారు
- నిర్వహణ గాలికొదిలేస్తున్నారు
- మొక్కుబడిగా విజిలెన్స్, మోనటరింగ్ కమిటీ సమావేశం
- డుమ్మాకొట్టిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు
సాక్షి, విశాఖపట్నం: ‘జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు..కాని వాటి నిర్వహణను మాత్రం గాలికొదిలేస్తున్నారు...శాఖల మధ్య సమన్వయంకొరవడడంతో నిర్మించిన ప్రాజెక్టులు ప్రజలకు అక్కరకురాకుండా పోతున్నాయి’ అంటూ ఎంపీలు ముత్తంశెట్టిశ్రీనివాసరావు, కొత్తపల్లి గీతలు ధ్వజమెత్తారు. కమిటీ చైర్‌పర్శన్ కొత్తపల్లి గీత అధ్యక్షతన కలెక్టరేట్‌లో జరిగిన విజిలెన్స్,మోనటరింగ్ కమిటీ సమావేశానికి ఎంపీ అవంతిశ్రీనివాసరావు మినహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. కమిటీసభ్యులైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది అధికారులు మాత్రమే పాల్గొన్నారు. తొలుత గత కమిటీలోతీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలపై జెడ్పీ సీఈఒ మహేశ్వరరెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ అవంతి మాట్లాడుతూ ఆర్‌డబ్ల్యూఎస్ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే విద్యుత్ శాఖ కనీసం విద్యుత్ కనెక్షన్లు కూడాఇవ్వడంలేదన్నారు. ఈ రెండుశాఖల మధ్య సమన్వయ లోపంవలన కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న మంచినీటిప్రాజెక్టులు ఎందుకు కొరగాకుండాతయారవుతున్నాయన్నారు. పనిదినాలకల్పనలో విశాఖ ప్రధమ స్థానంలో ఉందని డ్వామా పీడీ శ్రీరాములనాయుడు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి జీవో జారి అయ్యిందని ఎంపీ గీత తెలిపారు.సంసద్ ఆదర్శగ్రామాల్లో నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని ఎంపీ ముత్తంశెట్టి సూచించా రు. జిల్లాలో పచ్చదనం లోపించడం వలన ఎండలు తీవ్రంగా ఉంటున్నాయని, ఈ ఏడాది వర్షకాలంలో కోటి 50లక్షల మొక్కలు నాటేంకుదు ప్రణాళికలు సిద్దం చేసినట్టు డ్వామా పీడీ తెలియజేయగా, నాటడం కాదు..వాటిని సంరక్షించే బాధ్యతను చేపట్టాలని ఏంపీలు కలెక్టర్‌కు సూచించారు. ఏజెన్సీలో ఇళ్లు నిర్మించుకునే గిరిజనులకు పూర్తి సహయ సహకారాలుఅందించాలని కలెక్టర్‌యువరాజ్ హౌసింగ్ కార్పొరేషన్ అదికారులను ఆదేశించారు. జెడ్పీ చైర్‌పర్శన్‌లాలం భవాని పాల్గొన్నారు.