భీమవరం యూత్‌క్లబ్‌లో సింగిల్స్ పోటీల్లో సత్తాచాటుతున్న క్రీడాకారులు
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. అంటూ వయసు పైబడిన వారు యువతకు పోటీగా తమ ఆటతో అలరిస్తున్నారు. గెలవాలనే లక్ష్యం.. బాగా ఆడాలనే తపనతో రాకెట్ పట్టి టెన్నిస్ కోర్టులో పాదరసంలా దూసుకుపోతున్నారు. అంతర్జాతీయ ప్రొఫెషనల్ క్రీడాకారుల మాదిరిగా షాట్లు కొడుతూ చూపరులచే చప్పట్లు కొట్టించుకుంటున్నారు. భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి టెన్నిస్ టోర్నీ మూడు రోజులుగా జరుగుతోంది. ఈ పోటీల్లో వృద్ధులు తమ ఆటతో సత్తాచాటుతూ స్థానికులను అమితంగా ఆకట్టుకుంటున్నారు.
సాక్షి, భీమవరం (పశ్చిమ గోదావరి): వయసు పైబడినా వారిలో క్రీడాస్ఫూర్తి వెల్లువిరుస్తోంది. ఎంతో ఉత్సాహంగా టెన్నిస్ రాకెట్ పట్టుకుని కోర్టులోకి దిగితే యువకుల మాదిరిగా షాట్లు కొడుతూ తమ ప్రొఫెషనలిజమ్‌ను ప్రదర్శిస్తున్నారు. మూడు రోజులుగా భీమవరం పట్టణంలోని యూత్ కల్చరల్ అసోసియేషన్ (యూత్ క్లబ్)లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇండియన్ సీనియర్ టెన్నిస్ (జిస్టా) దోస సత్యనారాయణమూర్తి స్మారక జాతీయస్థాయి టెన్నిస్ టోర్నమెంట్‌లో వృద్ధులు సత్తా చాటుతున్నారు. జిస్టా ఆధ్వర్యంలో యూత్ క్లబ్ సహకారంతో ఐదు రోజుల పాటు నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో తమ ప్రతిభను చూపుతున్నారు.
నాలుగు విభాగాల్లో పోటీలు
35 ఫ్లస్, 45 ఫ్లస్, 55 ఫ్లస్, 65 ఫ్లస్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతిగా రూ.5 లక్షలు సత్యనారాయణమూర్తి కుమారుడు దోస రామకృష్ణ అందిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు భోజనం, వసతి వంటి సౌకర్యాలను యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా సమకూర్చారు. క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరుకావడంతో పోటీలను యూత్ క్లబ్‌తో పాటు కాస్మోపాలిటన్ క్లబ్, టౌన్‌హాల్స్‌లోని టెన్నిస్ కోర్టుల్లో నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గం కన్వీనర్ పీవీఎల్ నర్సింహరాజు అధ్యక్షుడిగా, భీమవరం డీఎన్నార్ కళాశాల అ«ధ్యక్షుడు గోకరాజు వెంకటనర్సింహరాజు గౌరవాధ్యక్షుడిగా పేరిచర్ల వెంకట శ్రీనివాసరాజు(సుభాష్) కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
రోగులకు సేవలందిస్తూనే..
మహారాష్ట్రకు చెందిన నేను వృత్తి రీత్యా డాక్టర్. అయితే టెన్నిస్ క్రీడపట్ల ఎంతో ఆసక్తి ఉంది. టెన్నిస్ హాబీగా చేసుకుని జాతీయస్థాయిలో ఎక్కడ చాంపియన్‌షిప్ పోటీలు జరిగినా హాజరవుతుంటా. ఎక్కడ పోటీలో పాల్గొన్నా సామాన్య క్రీడాకారుడిగానే భావించి కోర్టులోకి దిగుతుంటా. డాక్టర్‌గా రోగులకు సేవలందిస్తూనే ఎక్కువ సమయం టెన్నిస్ క్రీడకు కేటాయిస్తున్నా.
– అజిత్ పండార్కర్, మహారాష్ట్ర
అంతర్జాతీయ గుర్తింపే లక్ష్యం
నాలుగేళ్లుగా అనేక టోర్నమెంట్స్‌లో పాల్గొంటున్నాను. ఇండియా తరఫున సీనియర్ టెన్నిస్‌లో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందాలనేది నా లక్ష్యం. నేను వ్యాపారస్తుడినైనా టెన్నిస్ క్రీడకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది.
– దిలీప్ దేవాచ్, గుజరాత్
జాతీయస్థాయిలో విజేతగా నిలిచా
నా వయస్సు 74 ఏళ్లు. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో రీజనల్ ఇన్‌స్పెక్టర్ పనిచేశా. ప్రస్తుతం 65 ఫ్లస్ విభాగంలో టెన్నిస్ పోటీల్లో ఆడుతున్నా. గతంలో గుంటూరు, కావలి తదితర పట్టణాల్లో నేషనల్ టోర్నమెంట్లలో ఆడి విజేతగా నిలిచా.
– పెన్మెత్స గొల్ల కృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్
30 ఏళ్లుగా టెన్నిస్ ఆడుతున్నా
30 ఏళ్లుగా టెన్నిస్ ఆడుతున్నా. పట్టుదల, ఉత్సహం ఉంటే క్రీడలకు వయసుతో సంబంధం లేదు. ఇప్పటివరకు 20 నేషనల్ టోర్నమెంట్స్ ఆడాను. అనేకమంది టెన్నిస్‌లో శిక్షణ ఇస్తున్నా. నా వద్ద శిక్షణ తీసుకున్న క్రీడాకారులు పతకాలు తీసుకువస్తే ఎంతో ఆనందిస్తా.
– కె.కృష్ణంరాజు, తెలంగాణ
వసతులు అమోఘం
క్రీడాకారులకు యూత్ కల్చరల్ అసోసియేషన్ సమకూర్చిన వసతులు ఎంతగానో బాగున్నాయి. ఎంతో ఆప్యాయంగా ఆతీథ్యం ఇస్తున్నారు. క్రీడాకారులకు అన్ని వసతులు, భోజన సదుపాయం ఉచితంగా ఏర్పాటు చేయడం అభినందనీయం. వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో కలసి పాల్గొనడం కొత్త స్నేహితులను తెచ్చిపెడుతోంది.
– ఎం.శివ, ఆంధ్రప్రదేశ్
సీనియర్స్‌ను ప్రోత్సహించాలనే..
జాతీయస్థాయిలో యువతకు, విద్యార్థులకు తరచూ వివిధరకాల పోటీలు నిర్వహిస్తుంటారు. అయితే సీనియర్స్‌ను ప్రోత్సహించాలనే సంకల్పంతో జాతీయస్థాయి సీనియర్స్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. క్లబ్ సభ్యులు, దాతలు సహకారంతో ఈ పోటీలను నిర్వహించగలుగుతున్నాం.
– డీఎస్ రాజు, టోర్నమెంట్ కన్వీనర్, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment