రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
Published Wed, Sep 4 2013 5:52 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
పూసపాటిరేగ, న్యూస్‌లైన్ : జిల్లాలో వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలంలోని సీపీ ఆక్వా సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం బిచ్చగాడిని ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన అతనిని 108 వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఆయనకు సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో మృతదేహాన్ని మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. పూసపాటిరేగ ఎస్సై జి.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాన్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
రామభద్రపురం : మండల కేంద్రంలో బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కూరగాయల లోడుతో రామభద్రపురం నుంచి విశాఖ వెళ్తున్న వ్యాను బైపాస్ రోడ్డులో నడిచి వెళ్తున్న మిర్తివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు కలగర్ల కళావతి, సత్తిరాజులను ఢీకొంది. దీంతో ఇద్దరూ గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను 108 వాహనంలో బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన విశాఖకు చెందిన వ్యాన్ డ్రైవర్ చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో...
బెలగాం : ద్విచక్ర వాహనం అదుపు తప్పి, బోల్తా పడడంతో ఓ వ్యక్తి గాయాలపాలయ్యాడు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందిన కోమటిపల్లి లీలాప్రసాద్ గుమ్మలక్ష్మీపురంలో బంధువుల ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామం వెళ్తున్నాడు. మార్గమధ్యలోని దిగువ మండ మలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతనిని కురుపాం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స జరిపి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏరియా ఆస్పత్రి వైద్యులు అతనిని మెరుగైన వైద్యం కోసం విశాఖ రిఫర్ చేశారు.
Advertisement
Advertisement