సినిమాకి బయలుదేరి... మృత్యుఒడికి చేరాడు
జగ్గంపేట : పండగ రోజు సినిమాకి వెళ్లాలని ఇంటినుంచి ఉత్సాహంగా బయలుదేరిన ఇద్దరు యువకులు కొద్ది దూరంలోనే ప్రమాదానికి గురయ్యారు. వారిలో కుంచా నగేష్ (19) మరణించగా, తీవ్రంగా గాయపడిన మరో యువకుడు రంపా మణికంఠ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మండలంలోని జె. కొత్తూరు- జగ్గంపేట రోడ్లో పెట్రోల్‌బంక్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రాజపూడికి చెందిన మణికంఠ, నగేష్‌లు సినిమాకు వెళ్లాలని మధ్యాహ్నం 2-30 గంటల సమయంలో మోటార్‌సైకిల్‌పై జగ్గంపేట బయలుదేరారు.
జగ్గంపేట సమీపంలోని పెట్రోల్ బంక్ మలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ వేగంగా ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు తగిలాయి. నగేష్‌కు పొట్ట కింది అవయవాలు బాగా దెబ్బతినడంతో పరిస్థితి విషమించింది. తొలుత పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి 108 వాహనం రావడం ఆలస్యం కావడంతో పోలీస్జీప్లోనే క్షతగాత్రులను తరలించారు. వీరి బైక్‌ను ఢీకొన్న మరో మోటార్‌సైకిల్ చోదకుడు ఆగకుండా వెళ్లిపోయాడని, అతడి ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.