వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ
జగ్గంపేట వద్ద జాతీయ
రహదారిపై ప్రమాదం
ఇద్దరు మృతి,
మరొకరి పరిస్థితి విషమం
12 మందికి గాయాలు
జగ్గంపేట :పొట్ట కూటి కోసం వేకువజామునే చెరువులో చేపలు పట్టేందుకు వచ్చి ఇళ్లకు తిరిగి వెళ్లకుండానే జట్టులో ఇద్దరిని జగ్గంపేట వద్ద రోడ్డు ప్రమాదం శనివారం రాత్రి మృత్యువు కబళించింది. జాతీయ రహదారిపై స్థానిక కృష్ణవేణి థియేటర్ సెంటర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బొలేరా వ్యాన్‌ను రాజమండ్రి వైపు వెళుతున్న లారీ వేగంగా ఢీకొంది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న సుమారు 15 మందిలో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శంఖవరానికి చెందిన పులి కృష్ణ (40) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన పులి నాగేశ్వరరావు (45) ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంలో మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించి వివరాలిలా వున్నాయి. మండలంలోని కాండ్రేగుల గ్రామంలో గడివారి చెరువులో చేపలు పట్టేందుకు శంఖవరం మండలం నుంచి వ్యాన్‌పై శనివారం ఉదయమే సుమారు 15 మంది జట్టు సభ్యులు వచ్చారు.
వీరంతా చేపలు పట్టి వాటిని లోడు చేసిన తరువాత తిరిగి ఇంటికి వె ళ్లాల్సి ఉంది. లోడు పూర్తయ్యేందుకు రాత్రి ఆలస్యం అయ్యే అవకాశం ఉండడంతో భోజనం కోసం జగ్గంపేట వచ్చారు. హైవే కూడలిని దాటి వస్తున్న వీరి వాహనాన్ని తమిళనాడు వెళ్లే లారీ బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్లో ఉన్న కృష్ణ కింద పడిపోగా తలపై నుంచి చక్రాలు వెళ్లిపోయాయి. వ్యాన్ పల్టీలు కొట్టి తుని వైపు మార్గం మధ్యలో బోల్తా పడింది. ఈ ప్రమాదంతో వాహనంలో ఉన్న నాగేశ్వరరావు ఎడమ కాలు నుజ్జు నుజ్జు అయ్యింది. జట్టు కూలీలు ఒకరి తరువాత ఒకరు అన్నట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై సురేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నిలుపుదల చేసి క్షతగాత్రులను 108, హైవే పెట్రోలింగ్ వాహనం, ప్రైవేటు ఆటోలోనూ పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
స్వల్పంగా గాయపడిన వారిని జగ్గంపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. 108లో తరలిస్తుండగా కాలు నుజ్జయిన నాగేశ్వరరావు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన చిట్టుమూరి నాగేంద్ర పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. పెద్దాపురంలో ప్రథమ చికిత్స అనంతరం కొందరిని కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రమాదంలో మాతా సూరిబాబు, మేడిపాము కన్నారావు, మాకిరెడ్డి రాజబాబు, మేడిపాము సింహాచలం, కృష్ణ, సంగాడ వీరబాబు, ప్రవీణ్, పాదాలయ్య, సత్తిబాబు తదితరులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో డ్రైవర్ కాకుండా వేరే వ్యక్తి వ్యాన్ నడుపుతున్నట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కబళించిన మృత్యువు
Published Sun, Apr 5 2015 3:36 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement