ఉల్లి ధర స్థిరీకరణకు పిల్లిమొగ్గలు
Published Mon, Aug 19 2013 5:17 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : ముందుగా మేల్కొనాల్సిన అధికారులు ముసుగుతన్ని పడుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నింగికెగ యడంతో ప్రజల హాహాకారాలకు నిద్రమత్తునుంచి బయటకు వచ్చారు. హడావుడి చేశారు. వ్యాపారులతో భేటీ అయ్యారు. తాత్కాలికంగా ఉల్లి ధర పరుగును నిలువరించగలిగారు. ఫలితంగా ఉల్లి ధర పెరుగుదల ఆగి స్థిరంగా ఉంది. మహారాష్ట్రలో ఉల్లి ధరల నియంత్రణకుగాను అధికారులు కొరడా ఝళిపించారు. క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవ పరిస్థితులను గమనించి విదేశాలకు ఎగుమతులపై కొన్ని ఆంక్షలను మౌఖికంగా విధించారు. దీంతో ధరలు ఈ వారం స్థిరంగా ఉన్నాయి. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు సరుకు దిగుమతి భారీగా తగ్గింది. 150 నుంచి 200 లారీల కర్నూలు ఉల్లి మార్కెట్‌కు రావాల్సి ఉండగా, 25 లారీలు మాత్రమే వచ్చాయి.
వీటి ధర క్వింటాలు రూ.2,500 నుంచి 4,500 వరకు ఉంది. మహారాష్ట్ర ఉల్లి క్వింటాలు రూ.4 వేల నుంచి 5 వేల వరకు ఉంది. రిటైల్ మార్కెట్‌లో కిలో ఉల్లి పాయలు రకాన్నిబట్టి రూ. 35 నుంచి రూ.55 వరకు ఉన్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటంతో కర్నూలులో చేతి కందాల్సిన ఉల్లి పంట దెబ్బతింది. కర్నూలు నుంచి వచ్చిన ఉల్లిపాయలు పూర్తిగా తడిసిపోయి ఉన్నాయి. ఈ రకం నిల్వకు ఆగే పరిస్థితి లేదు. ఈ సరుకు కొనటానికి ఎగుమతిదారులు ముందుకు రావడం లేదు. వీటిని స్థానిక అవసరాల నిమిత్తమే జిల్లాలోని వ్యాపారులు కొంటున్నారు.
రూ.45కే కిలో ఉల్లి ఏలూరు రైతుబజార్‌లో విక్రయాలు
ఏలూరు, న్యూస్‌లైన్ : వినియోగదారులను కంట నీరుపెట్టిస్తున్న ఉల్లి ధరను నియంత్రించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. స్థానిక పత్తేబాదలోని రైతు బజార్‌లో సోమవారం నుంచి కిలో ఉల్లిని రూ.45 విక్రయించేందుకు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. తదనంతరం అన్ని పట్టణాల్లోను ఉల్లిని విక్రయించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. సమైక్యాంధ్ర ఆందోళన నేపథ్యంలో ఉల్లి ధర అమాంతం ఆకాశన్నంటింది. రాష్ట్ర విభజన ప్రకటనకు ముందు ఉల్లి ధర రూ.18 ఉండగా సైమైక్యాంధ్ర ఆందోళనతో రోజురోజుకు పెరుగుతూ రూ.65కు చేరింది.
ధర నియంత్రణకు కలెక్టర్, జేసీలు ఉల్లి హోల్‌సేల్ వ్యాపారులతో చర్చలు జరిపారు. కిలో ఉల్లిని రూ.45 విక్రయించేందుకు వారు అంగీకరించారు. దీంతో ప్రస్తుతానికి ఈ రే టుకు అందించేందుకు సమాయత్తం అయ్యారు. సోమవారం నుంచి ఏలూరులో రూ.45 కిలో ఉల్లిని విక్రయిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మార్కెటింగ్‌శాఖ ఏడీ కె.నాగేశ్వరశ ర్మ తెలిపారు. పత్తేబాద బజార్‌లో ఉల్లి అమ్మకాలకు ఏర్పాట్లను ఆదివారం ఆయన పర్యవేక్షించారు.
Advertisement