ఉల్లి.. మళ్లీ లొల్లి
తాడేపల్లిగూడెం : వ్యాపార వర్గాలు అంచనా వేసినట్టుగానే ఉల్లి బాంబు పేలింది. వర్షాలకు పంటల దిగుబడులు తగ్గిపోవడంతో మహారాష్ట్ర మార్కెట్‌లో ఉల్లిపాయలకు కొరత ఏర్పడింది. దీనికితోడు కొన్ని మార్కెట్ల అవసరాలను తీర్చే కర్నూలు ఉల్లిపాయల సీజన్ ముగిసింది. దీంతో డిమాండ్‌కు, సరఫరాకు మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఉల్లి ధరకు గుత్త మార్కెట్‌లో రెక్కలు వచ్చాయి. ఈ ప్రభావంతో రిటైల్ మార్కెట్‌లో వీటి ధర ఆకాశం వైపునకు చూడటం ప్రారంభించాయి. యుఏఈ దేశాలతో ఒప్పందాలలో భాగంగా నాణ్యమైన ఉల్లిపాయలు ఎగుమతి అవుతున్నాయి.
దీంతో మిగిలిన నాసిరకాలు మార్కెట్లకు వచ్చినా, వాటి ధర వినియోగదారులకు అందకుండా ఉంది. వీటికి తోడు వాతావరణ మార్పులు ఉల్లి ధరలు పెంచేలా చేశాయి. గత 15 రోజులుగా ఉల్లిపాయల ధర పెరుగుతూ వస్తోంది. జూన్‌లో కిలో రూ.20 పైగా, జూలై మొదటివారంలో రూ.30కు గుత్త మార్కెట్‌లో ధర పెరుగుతుందని వ్యాపార వర్గాలు అంచనావేశాయి. దీనికి అనుగుణంగానే ఆదివారం మహారాష్ర్ట ఉల్లిపాయలు పదికిలోల ధర రూ.230కి చేరింది. ఎండ కారణంగా మార్కెట్‌కు సరుకు రాకపోవడం, ఉన్న సరుకును ఇతర మార్కెట్లకు తరలించడానికి లారీలు అందుబాటులో లేకపోవడం తదితర కారణాలతో ధర పెరిగింది. ఆదివారం పది లారీల సరుకు మాత్రమే మార్కెట్‌కు వచ్చింది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.