కర్నూలు ఉల్లికి కేరాఫ్ గూడెం..! | Kurnool onions get exported from Tadepalligudem | Sakshi
Sakshi News home page

కర్నూలు ఉల్లికి కేరాఫ్ గూడెం..!

Published Sat, Oct 26 2013 1:15 AM | Last Updated on Fri, Sep 1 2017 11:58 PM

కర్నూలు ఉల్లికి కేరాఫ్ గూడెం..!

కర్నూలు ఉల్లికి కేరాఫ్ గూడెం..!

తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్: అక్కడ ఉల్లి పండదు. పోనీ ఉల్లి పండే ప్రాంతానికి అది దగ్గరా కాదు. అయితేనేం! కర్నూలు ఉల్లికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది తాడేపల్లి గూడెం. రాష్ట్రంలోనే ఉల్లిపాయల మార్కెట్‌కు అతిపెద్ద కేంద్రంగా మారింది. ఎందుకిలా? కర్నూలు రైతులు పండిస్తున్న ఉల్లిని సుదూరాన ఉన్న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వ్యాపారులెందుకు అమ్ముతున్నారు? ఈ కథ తెలుసుకోవాలని ఉందా? అయితే ఇదిగో...
 
 దాదాపు 45 ఏళ్ల కిందట... అంటే 1970ల మొదట్లో తాడేపల్లిగూడెం మార్కెట్‌లోని వ్యాపారులు ఉల్లిపాయలను హైదరాబాద్ పరిసర మార్కెట్లలో కొనుగోలు చేసేవారు. అక్కడి నుంచి తెచ్చుకుని, తాడేపల్లి గూడెం నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. అలా ఇక్కడ ఉల్లి మార్కెట్ ప్రస్థానం మొదలైంది. అప్పట్లో ఎక్కువగా ఉల్లిని హైదరాబాద్‌లో అమ్మేది కర్నూలు వ్యాపారులే. వారికి సరైన ధర లభించేది కాదు కూడా.
 
 ఇది గమనించిన గూడెం వ్యాపారులు కర్నూలు రైతులతో సంబంధాలు పెంచుకున్నారు. అవసరమైన వారికి ముందే పెట్టుబడులు సమకూర్చేవారు. తరవాత పంటను కూడా తగిన ధర చెల్లించి కొనేవారు. ముందే ధరపై భరోసా ఇవ్వటం, పెట్టుబడి పెట్టడం, ఎప్పటికప్పుడు నగదు చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూస్తుండటంతో కర్నూలు రైతులు దాదాపు 60 శాతం పంటను నేరుగా తాడేపల్లి గూడేనికే తీసుకొచ్చి విక్రయించటం మొదలుపెట్టారు. మొదట్లో వారానికి 10 లారీల సరుకు తాడేపల్లిగూడెం మార్కెట్‌కు వచ్చేది. ఇక్కడకు తెచ్చిన రైతులకు మెరుగైన ధర రావటంతో మిగతా రైతులూ తోడయ్యారు. అలా... లారీల సంఖ్య రోజుకు 150-200కు చేరింది. ఇక్కడి నుంచి కోల్‌కత, బంగ్లాదేశ్‌లకు భారీగా ఉల్లి ఎగుమతి అవుతుండటంతో ఎంత సరుకొచ్చినా ధర గిట్టుబాటయ్యేది.
 
 వడ్డీ మినహాయింపు.. వెంటనే నగదు చెల్లింపు
 కర్నూలు ఉల్లి రైతులకు స్థానిక వ్యాపారులు పెట్టుబడి పెడితే ఆ సొమ్ముకు రెండు రూపాయల వడ్డీ వసూలు చేసేవారు. దీంతో పాటు అక్కడ సరుకును విక్రయించినందుకు నాలుగు శాతం కమిషన్ ను చెల్లించాల్సి వచ్చేది. ఇక ఉల్లిని రాశులుగా పోసి గ్రేడింగ్ చేశాక విక్రయిస్తుండటంతో అందరికీ ఒకే ధర వచ్చేది కాదు. వీటన్నిటికీ తోడు పంటను అమ్ముకున్న 15 నుంచి నెల రోజులకు సొమ్ము చేతికందేది. అదే తాడేపల్లిగూడెం మార్కెట్‌లో అయితే రైతుకు పెట్టుబడిగా ఇచ్చిన సొమ్ముపై వ్యాపారులు వడ్డీ తీసుకోరు. కర్నూలు మార్కెట్ కంటే క్వింటాల్‌కు రెండు వందలకు తగ్గకుండా ధర నిర్ణయించి సొమ్ములిస్తారు. లారీలో వచ్చిన సరుకులో ఒకటి, రెండు బస్తాల నాణ్యతను చూసి సరుకును కొనుగోలు చేసి వెంటనే రైతుకు సొమ్ము చెల్లిస్తామని ప్రముఖ ఉల్లిపాయల వ్యాపారి నంద్యాల కృష్ణమార్తి(ఎన్‌కే) తెలిపారు. తమ వద్ద సరుకు కొనుగోలు చే సిన చిరు వ్యాపారులు వెంటనే సొమ్ములిచ్చినా ఇవ్వకపోయినా రైతులకు మాత్రం వెంటనే చెల్లిస్తామని తెలిపారు. ఏటా ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కర్నూలు రైతులు వారానికి 1000 నుంచి 1400 లారీల సరుకును తాడేపల్లిగూడెం మార్కెట్‌కు తెస్తారు. రైతులకు ఎకరాకు పెట్టుబడిగా రూ.40 వేల వరకు అప్పు ఇవ్వడంతో పాటు, సంచులను సరఫరా చేస్తారు. రైతుల కష్టానికి ఫలితం రావడంతో కర్నూలు ఉల్లిపాయలకు తాడేపల్లిగూడెం సంప్రదాయ మార్కెట్‌గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement