ఇసుక ఇక అందరికీ అందుబాటులోకి రానుంది. ఒకటి రెండురోజుల్లో ఆన్‌లైన్ బుకింగ్‌కు అనుమతి లభించనుంది. లాక్‌డౌన్ కారణంగా కుదేలైన నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 49 రోజులుగా పనుల్లేక కూలీలు సైతం అల్లాడిపోతున్నారు. ఈ రంగంలో పనులు ఊపందుకునేందుకు జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. ప్రధానంగా ఇసుక కొరతను తీర్చేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా రెండు స్టాక్ పాయింట్లు ఏర్పాటుచేసి సుమారు 3 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వచేసేలా కసరత్తు చేశారు.
నెల్లూరు(సెంట్రల్): ఇసుక తరలింపునకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో గతంలో బుక్ చేసుకున్న వారికి, ప్రభుత్వ పనులకు ప్రస్తుతం డోర్ డెలివరీ ప్రారంభించారు. కాగా ఇసుక అవసరం ఉన్నవారు ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్ చేసుకునేలా మంగళ లేదా బుధవారాల నుంచి అనుమతి ఇవ్వనున్నారు. ఈ వ్యవస్థను పర్యవేక్షించేందుకు జిల్లాకు ప్రత్యేక డిప్యూటీ డైరెక్టర్‌ను కూడా నియమించారు.
♦ ఈ ఏడాది కూడా సకాలంలో వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఆ సమయంలో నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా చూసేందుకు సంబంధిత శాఖ అధికారులు ముందుస్తు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా రెండు స్టాక్ రిజర్వ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వాకాడు సమీపంలోని కోట మండలం కొండగుంట ప్రాంతంలో ఒకటి, నెల్లూరు సమీపంలోని కొండాయపాళెం జాతీయ రహదారిపై మరొకటి ఉంచారు. రెండుచోట్ల 3 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వచేసేలా తరలిస్తున్నారు.
♦ జిల్లాలో పొట్టేపాళెం (నాలుగు రీచ్‌లు), సజ్జాపురం, గొల్లకందుకూరు, మినగల్లు, విరువూరు, ముదివర్తి, పడమటికంభంపాడు, అప్పారావుపాళెం, లింగంగుంటల్లో రీచ్‌లను ఏర్పాటు చేశారు. వీటికి అనుబంధంగా ఆయా రీచ్‌లకు దగ్గర్లో పొట్టేపాళెం, జొన్నవాడ, విరువూరు, ముదివర్తి, పడమటి కంబంపాడు, అప్పారావుపాళెం ప్రాంతాల్లో ఆరు స్టాక్ పాయింట్లను ఉంచారు. కాగా పడమటికంభంపాడు, పెన్నా బద్వేల్, లింగంగుంట, దువ్వూరు, జొన్నవాడ, గొల్లకందుకూరు ప్రాంతాల్లో చిన్నపాటి సమస్యల కారణంగా రవాణా చేయలేని పరిస్థితి ఉంది. మిగిలిన ప్రాంతాల నుంచి ఇసుకను ప్రస్తుతం తరలిస్తున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
♦ వినియోగదారుల కోసం వెంకటగిరి, వింజమూరు, కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేట ప్రాంతాల్లో ప్రత్యేక ఇసుక డిపోలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ముందుగానే ఇసుకను స్టాక్ చేశారు. వర్షాకాలంలో రీచ్‌ల నుంచి తరలించే పరిస్థితి లేకపోతే ఇక్కడి నుంచి వినియోదారులకు సరఫరా చేస్తారు.
ఏర్పాట్లు చేశాం
జిల్లాలో ఇసుక కొరత లేకుండా సరఫరా చేసేందుకు ఐదు డిపోలను ఏర్పాటు చేశాం. అదేవిధంగా వర్షాకాలంలో కూడా ఇసుకను నిరంతరం సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా రెండు రిజర్వ్ పాయింట్లను పెట్టాం. వీటి ద్వారా ఎప్పుడు ఇసుక అవసరమైనా తరలించేలా చర్యలు తీసుకున్నాం.– గంగాధర్‌రెడ్డి, జిల్లా మేనేజర్,ఏపీ ఎండీసీ
Comments
Please login to add a commentAdd a comment