
మృతదేహం వద్ద కన్నీరుమన్నీరవుతున్న కుటుంబ సభ్యులు
చిత్తూరు, మదనపల్లె టౌన్: ఆపరేషన్ వికటిం చి కడప జిల్లా గాలివీడు మండలం ఎగువగొట్టెకు చెందిన రైతు పోగల గంగయ్య కుమారుడు పి.వెంకటరమణ(60) మృతి చెందిన సంఘటన ఆదివారం మదనపల్లె పట్టణంలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. వెంకటరమణ వ్యవసాయంతో పాటు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబా న్ని పోషించుకుంటున్నాడు. నెల రోజులుగా యూరిన్ పోసే సమయంలో మంట వస్తుండడంతో మదనపల్లె ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి నాలుగు రోజుల క్రితం వచ్చాడు. అప్పటి వరకు అతను బాగానే ఆస్పత్రికి నడచుకుంటూ వచ్చాడు. ఒంటికిలో మంటగా ఉందని ఓపీలో ఉన్న డాక్టరుకు చూపించాడు.
యూరిన్‌లో ఇన్ఫెక్షన్ ఉందని, ఆపరేషన్ చేస్తే తగ్గుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. డాక్టర్ శనివారం రాత్రి ఆపరేషన్ చేశాడు. ఆ ఆపరేషన్ కాస్త వికటించడంతో రోగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి చేరడంతో డాక్టర్, అక్కడి సిబ్బంది తెలివిగా రోగిని తిరుపతికి తీసుకెళ్లాలని చేతులెత్తేశారు. కుటుంబ సభ్యులు ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆదివారం తిరుపతికి బయలుదేరగా వెంకటరమణ మార్గమధ్యంలో మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రిలోని డాక్టర్ ఆపరేషన్ చేయడం వల్లనే వెంకటరమణ చనిపోయాడని వారు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. మృతుడికి భార్య నాగమునెమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయమై వెంకటరమణ మృతి విషయంపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.