ఒంగోలు టూటౌన్ : ఆధార్‌కార్డు రగడ మరోసారి తెరపైకొచ్చింది. ఎన్నికల ముందు వరకూ సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఆధార్ కార్డు తప్పనిసరని నిబంధనలు విధించడంతో ఆధార్ కార్డులు లేని వారంతా అధిక ధరలు వెచ్చించి సిలిండర్లు కొనుగోలు చేసి అవస్థపడ్డారు.
దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ సాధారణ ధరలకే సిలిండర్లు సరఫరా చేయాలని ఆదేశించడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అయితే, ఈసారి రేషన్‌కార్డుకు ఆధార్ కార్డును లింకుపెట్టి చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పొందే లబ్ధిదారుల ప్రయోజనాలకు గండికొట్టేవిధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రేషన్‌కార్డుకు ఆధార్‌కార్డు, ఫ్యామిలీ ఫొటో అనుసంధానం చేయాలని, లేకుంటే ఆ కార్డు చెల్లదని పౌరసరఫరాల శాఖాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇంకా ఆధార్‌కార్డు పొందలేకపోయిన తెలుపు రంగు రేషన్‌కార్డుదారులు తమకు సరుకులు అందవేమోనని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో 33.97 లక్షల మంది జనాభా ఉన్నారు. 2,202 చౌకధరల దుకాణాలున్నాయి. మొత్తం 8,90,507 రేషన్ కార్డులు మంజూరు చేయగా, వాటిలో 6,73,999 తెలుపురంగు రేషన్ కార్డులు, 52,140 అంత్యోదయ కార్డులు, వెయ్యి అన్నపూర్ణకార్డులు ఉన్నాయి. తాత్కాలిక కూపన్లతో మరో 55,085 మంది చౌకధరల దుకాణాల నుంచి సరుకులు పొందుతున్నారు. ఈ కూపన్లకు గత నెలతో గడువు ముగియడంతో కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం మళ్లీ కూపన్లు మంజూరు చేసింది.
ప్రజాపంపిణీ వ్యవస్థకు ఎన్‌టీఆర్ ప్రజాపంపిణీ పథకంగా పేరు మార్చి కూపన్లు మంజూరు చేసింది. వాటి ద్వారా దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు రాయితీపై ప్రతినెలా నిత్యవసర సరుకులు సరఫరా చేస్తోంది. అయితే, ప్రస్తుతం రేషన్ కార్డులకు ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటోలను అనుసంధానం చేయాలని, లేకుంటే ఆ కార్డు చెల్లదని, సరుకులు కూడా అందవని ప్రభుత్వం మెలిక పెట్టడంతో లబ్ధిదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఇంకా అందని ఆధార్ కార్డులు...
ఆధార్ కార్డుతో పాటు ఫ్యామిలీ ఫొటోను ఆన్‌లైన్‌లో రేషన్‌కార్డుకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించాలని సూచించింది. ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటో అనుసంధానం చేయని రేషన్‌కార్డులను బ్లాక్ లిస్టులోపెట్టి చౌకధరల దుకాణాల ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీ నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
దీంతో ఆధార్ కార్డుల కోసం వివరాలు నమోదు చేసుకుని ఇంకా కార్డులు అందని వారు, నేటికీ వివరాలు కూడా నమోదు చేసుకోని వారు ఆందోళన కు గురవుతున్నారు. జిల్లాకు చెందిన అనేకమంది ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకున్నప్పటికీ నేటికీ కార్డులు అందలేదు. కొంతమంది రెండోసారి కూడా వివరాలు నమోదు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలను కలవరానికి గురిచేస్తోంది. ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటో అనుసంధానంపై ఆగస్టు నుంచే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నట్లు అధికారులు చెబుతుండటంతో చౌకధరల దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్న రేషన్ కార్డుదారులు ఇప్పటి నుంచే కంగారుపడుతున్నారు.
అనుసంధానం తప్పనిసరి : రంగాకుమారి, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారిణి
ఆధార్ కార్డుతో పాటు ఫ్యామిలీ ఫొటోను రేషన్‌కార్డుకు ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాల్సి ఉంది. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లేకుంటే రేషన్‌కార్డును బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశం ఉంది.
మళ్లీ ‘ఆధార్’ రగడ
Published Wed, Jul 9 2014 3:19 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM
Advertisement
Advertisement