subsidy gas cylinders
-
మళ్లీ ‘ఆధార్’ రగడ
ఒంగోలు టూటౌన్ : ఆధార్‌కార్డు రగడ మరోసారి తెరపైకొచ్చింది. ఎన్నికల ముందు వరకూ సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఆధార్ కార్డు తప్పనిసరని నిబంధనలు విధించడంతో ఆధార్ కార్డులు లేని వారంతా అధిక ధరలు వెచ్చించి సిలిండర్లు కొనుగోలు చేసి అవస్థపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ సాధారణ ధరలకే సిలిండర్లు సరఫరా చేయాలని ఆదేశించడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అయితే, ఈసారి రేషన్‌కార్డుకు ఆధార్ కార్డును లింకుపెట్టి చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు పొందే లబ్ధిదారుల ప్రయోజనాలకు గండికొట్టేవిధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రేషన్‌కార్డుకు ఆధార్‌కార్డు, ఫ్యామిలీ ఫొటో అనుసంధానం చేయాలని, లేకుంటే ఆ కార్డు చెల్లదని పౌరసరఫరాల శాఖాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇంకా ఆధార్‌కార్డు పొందలేకపోయిన తెలుపు రంగు రేషన్‌కార్డుదారులు తమకు సరుకులు అందవేమోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 33.97 లక్షల మంది జనాభా ఉన్నారు. 2,202 చౌకధరల దుకాణాలున్నాయి. మొత్తం 8,90,507 రేషన్ కార్డులు మంజూరు చేయగా, వాటిలో 6,73,999 తెలుపురంగు రేషన్ కార్డులు, 52,140 అంత్యోదయ కార్డులు, వెయ్యి అన్నపూర్ణకార్డులు ఉన్నాయి. తాత్కాలిక కూపన్లతో మరో 55,085 మంది చౌకధరల దుకాణాల నుంచి సరుకులు పొందుతున్నారు. ఈ కూపన్లకు గత నెలతో గడువు ముగియడంతో కొత్తగా ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వం మళ్లీ కూపన్లు మంజూరు చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థకు ఎన్టీఆర్ ప్రజాపంపిణీ పథకంగా పేరు మార్చి కూపన్లు మంజూరు చేసింది. వాటి ద్వారా దారిద్య్రరేఖకు దిగువనున్న పేదలకు రాయితీపై ప్రతినెలా నిత్యవసర సరుకులు సరఫరా చేస్తోంది. అయితే, ప్రస్తుతం రేషన్ కార్డులకు ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటోలను అనుసంధానం చేయాలని, లేకుంటే ఆ కార్డు చెల్లదని, సరుకులు కూడా అందవని ప్రభుత్వం మెలిక పెట్టడంతో లబ్ధిదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంకా అందని ఆధార్ కార్డులు... ఆధార్ కార్డుతో పాటు ఫ్యామిలీ ఫొటోను ఆన్లైన్లో రేషన్‌కార్డుకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను తహసీల్దార్ కార్యాలయాల్లో నిర్వహించాలని సూచించింది. ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటో అనుసంధానం చేయని రేషన్‌కార్డులను బ్లాక్ లిస్టులోపెట్టి చౌకధరల దుకాణాల ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీ నిలిపివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఆధార్ కార్డుల కోసం వివరాలు నమోదు చేసుకుని ఇంకా కార్డులు అందని వారు, నేటికీ వివరాలు కూడా నమోదు చేసుకోని వారు ఆందోళన కు గురవుతున్నారు. జిల్లాకు చెందిన అనేకమంది ఆధార్ కార్డు కోసం ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకున్నప్పటికీ నేటికీ కార్డులు అందలేదు. కొంతమంది రెండోసారి కూడా వివరాలు నమోదు చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలను కలవరానికి గురిచేస్తోంది. ఆధార్ కార్డు, ఫ్యామిలీ ఫొటో అనుసంధానంపై ఆగస్టు నుంచే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నట్లు అధికారులు చెబుతుండటంతో చౌకధరల దుకాణాలపై ఆధారపడి జీవిస్తున్న రేషన్ కార్డుదారులు ఇప్పటి నుంచే కంగారుపడుతున్నారు. అనుసంధానం తప్పనిసరి : రంగాకుమారి, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారిణి ఆధార్ కార్డుతో పాటు ఫ్యామిలీ ఫొటోను రేషన్‌కార్డుకు ఆన్లైన్లో అనుసంధానం చేయాల్సి ఉంది. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లేకుంటే రేషన్‌కార్డును బ్లాక్‌లిస్టులో పెట్టే అవకాశం ఉంది. -
ఆగని ‘ఆధార్’ బాదుడు
ఆధార్ లేనివారికి గ్యాస్‌బండ రూ.1,220.50 ఒక్కో సిలిండర్‌పై రూ. 771 అదనపు భారం అమలుకు నోచుకోని కేంద్ర కేబినెట్ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదంటున్న గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ వద్దంటూ తిప్పిపంపుతున్న వినియోగదారులు సాక్షి, హైదరాబాద్: ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య)తో సంబంధం లేకుండా పాత విధానంలోనే సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు అందించాలని కేంద్రం ప్రకటించి పక్షం రోజులు దాటినా ఇప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు. ఆధార్‌తో నిమిత్తం లేకుండా ఏడాదికి 12 చొప్పున వంటగ్యాస్ సిలిండర్లను సబ్సిడీతో వినియోగదారులందరికీ అందించాలని కేంద్ర కేబినెట్ గతనెల 30న నిర్ణయించడంతో ఆధార్ లేనివారు ఎంతో ఊరట చెందారు. కేంద్రం నిర్ణయం ప్రకారం పాత విధానంలోనే సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లు ఈ నెల 1 నుంచే అందుతాయని వినియోగదారులు ఆశించారు. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంకా ఆధార్ లింకును తప్పించడంలేదు. ఆధార్‌తో అనుసంధానం ఉన్నవారికి బ్యాంకుల ద్వారానే సబ్సిడీని జమ చేస్తున్నాయి. ఆధార్ లేనివారికి మాత్రం సబ్సిడీ రహిత వంట గ్యాస్ సిలిండర్ రూ.1,220.50 ధరతో అందిస్తున్నాయి. దీంతో ఒక్కో సిలిండర్‌కు వీరిపై రూ.771.63 అదనపు భారం పడుతోంది. ఆధార్‌తో సంబంధం లేకుండా సబ్సిడీ సిలిండర్లు అందించాలని కేంద్రం నిర్ణయించింది కదా? అని వినియోగదారులు ప్రశ్నిస్తే తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, ఆయిల్ కంపెనీలవారు స్పష్టం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు డీలర్లతో గొడవకు దిగుతున్నారు. కేంద్రం తీరులో ఏదో మతలబు: కేంద్ర నిర్ణయం వల్ల గ్యాస్ సిలిండర్ రూ. 420కే వస్తుందని ఆశించి బుక్ చేసుకున్న వినియోగదారులకు గ్యాస్ డెలివరీ బాయిస్ రూ.1,220.50 బిల్లు అందిస్తున్నారు. దీంతో చాలామంది సిలిండరు తీసుకోకుండా వెనక్కు పంపుతున్నారు. కంపెనీలకు కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే సబ్సిడీతో గ్యాస్ లభిస్తుందనే ఆశతోనే ఆధార్‌లేని వారు బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నారని డీలర్లు తెలిపారు. అయితే వంటగ్యాస్ సబ్సిడీకి ఆధార్ అనుసంధానం రద్దు నిర్ణయం గురించి కేంద్రం ఇప్పటికీ తెలియజేయకపోవడాన్ని అధికారులు, డీలర్లు తప్పుపడుతున్నారు. ఇందులో ఏదో మతలబు ఉందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ‘సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లను ఏడాదికి 9 నుంచి 12కు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి డీలర్లకు తక్షణమే ఆదేశాలు వచ్చాయి. కానీ అదే కేబినెట్ సమావేశంలో.. ఆధార్ లింకును తప్పించి పాత విధానంలోనే సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై తీసుకున్న నిర్ణయంపై మాత్రం సమాచారం రాలేదు. దీనిని బట్టే కేంద్ర ప్రభుత్వ తీరులో ఏదో మతలబు ఉన్నట్లనిపిస్తోంది’ అని ఢిల్లీలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇదీ పరిస్థితి... రాష్ట్రంలో 1.70 కోట్ల మంది వంటగ్యాస్ వినియోగదారులుండగా 40 శాతం మంది (77 లక్షలు) ఆధార్‌ను అనుసంధానం చేసుకోలేదు. దీంతో వారంతా నష్టపోతున్నారు. ఆధార్ లేని వినియోగదారులపై ఒక్కో సిలిండర్‌కు రూ. 771 అదనపు భారం పడుతోంది. 77లక్షల మంది ఒక్కో సిలిండర్ తీసుకున్నట్లు పరిగణిస్తే మొత్తంగా రూ.593.67కోట్ల అదనపు భారం పడినట్లయింది. పాత పద్ధతిలోనే సబ్సిడీ వంటగ్యాస్ అందించాలని కేంద్రం నిర్ణయించిందంటే నగదు బదిలీని నిలిపివేసినట్లే. ఇది అమలైతే ఆధార్ అనుసంధానమైన వారికి కూడా సిలిండర్‌పై రూ. 30 వరకూ అదనపు భారం తప్పుతుంది. అంటే ప్రస్తుతం నగదు బదిలీ ద్వారా వీరికి సబ్సిడీ సిలిండర్ ధర రూ. 478.87 పడుతోంది. నగదు బదిలీ కాకుండా నేరుగా సబ్సిడీ సిలిండరు అందిస్తే వినియోగదారులకు లభించే బిల్లుకే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పడుతుంది. దీనివల్ల ప్రస్తుతం నగదు బదిలీ పరిధిలో ఉన్న 93 లక్షల మంది నెలకు సగటున రూ. 27.90 కోట్లు అదనంగా చెల్లిస్తున్నా రు. సుప్రీం ఆదేశాలు బుట్టదాఖలు! ఆధార్‌కు చట్టబద్ధతలేదని, దీనికి వంటగ్యాస్ సబ్సిడీతో లింకు పెట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించి మూడునెలలైనా కేంద్రం పట్టించుకోవడంలేదు. ఎవరైనా కోర్టుకు వెళితే కోర్టు ధిక్కారం కింద ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర కేబినెట్ ఆధార్‌తో లింకును వంటగ్యాస్‌కు రద్దుచేసినట్లు ప్రకటించింది. కానీ ఈ ఆదేశాలు అమలు చేయాలంటూ కంపెనీలకు ఆదేశాలు పంపడంలో మాత్రం జాప్యం చేస్తోంది. వీలైనంత జాప్యంతో సబ్సిడీని మిగిల్చుకోవాలన్నదే కేంద్రం ఉద్దేశమని ఆయిల్ కంపెనీల వారు అంటున్నారు. ఇది సుప్రీంను తప్పుదోవ పట్టించడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి.