ఆగని ‘ఆధార్’ బాదుడు
ఆధార్ లేనివారికి గ్యాస్‌బండ రూ.1,220.50
ఒక్కో సిలిండర్‌పై రూ. 771 అదనపు భారం
అమలుకు నోచుకోని కేంద్ర కేబినెట్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదంటున్న గ్యాస్ ఏజెన్సీలు
గ్యాస్ వద్దంటూ తిప్పిపంపుతున్న వినియోగదారులు
సాక్షి, హైదరాబాద్: ఆధార్ (విశిష్ట గుర్తింపు సంఖ్య)తో సంబంధం లేకుండా పాత విధానంలోనే సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు అందించాలని కేంద్రం ప్రకటించి పక్షం రోజులు దాటినా ఇప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు. ఆధార్‌తో నిమిత్తం లేకుండా ఏడాదికి 12 చొప్పున వంటగ్యాస్ సిలిండర్లను సబ్సిడీతో వినియోగదారులందరికీ అందించాలని కేంద్ర కేబినెట్ గతనెల 30న నిర్ణయించడంతో ఆధార్ లేనివారు ఎంతో ఊరట చెందారు. కేంద్రం నిర్ణయం ప్రకారం పాత విధానంలోనే సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లు ఈ నెల 1 నుంచే అందుతాయని వినియోగదారులు ఆశించారు. అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంకా ఆధార్ లింకును తప్పించడంలేదు. ఆధార్‌తో అనుసంధానం ఉన్నవారికి బ్యాంకుల ద్వారానే సబ్సిడీని జమ చేస్తున్నాయి. ఆధార్ లేనివారికి మాత్రం సబ్సిడీ రహిత వంట గ్యాస్ సిలిండర్ రూ.1,220.50 ధరతో అందిస్తున్నాయి. దీంతో ఒక్కో సిలిండర్‌కు వీరిపై రూ.771.63 అదనపు భారం పడుతోంది. ఆధార్‌తో సంబంధం లేకుండా సబ్సిడీ సిలిండర్లు అందించాలని కేంద్రం నిర్ణయించింది కదా? అని వినియోగదారులు ప్రశ్నిస్తే తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, ఆయిల్ కంపెనీలవారు స్పష్టం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు డీలర్లతో గొడవకు దిగుతున్నారు.
కేంద్రం తీరులో ఏదో మతలబు: కేంద్ర నిర్ణయం వల్ల గ్యాస్ సిలిండర్ రూ. 420కే వస్తుందని ఆశించి బుక్ చేసుకున్న వినియోగదారులకు గ్యాస్ డెలివరీ బాయిస్ రూ.1,220.50 బిల్లు అందిస్తున్నారు. దీంతో చాలామంది సిలిండరు తీసుకోకుండా వెనక్కు పంపుతున్నారు. కంపెనీలకు కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే సబ్సిడీతో గ్యాస్ లభిస్తుందనే ఆశతోనే ఆధార్‌లేని వారు బుకింగ్‌లను రద్దు చేసుకుంటున్నారని డీలర్లు తెలిపారు. అయితే వంటగ్యాస్ సబ్సిడీకి ఆధార్ అనుసంధానం రద్దు నిర్ణయం గురించి కేంద్రం ఇప్పటికీ తెలియజేయకపోవడాన్ని అధికారులు, డీలర్లు తప్పుపడుతున్నారు. ఇందులో ఏదో మతలబు ఉందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ‘సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లను ఏడాదికి 9 నుంచి 12కు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి డీలర్లకు తక్షణమే ఆదేశాలు వచ్చాయి. కానీ అదే కేబినెట్ సమావేశంలో.. ఆధార్ లింకును తప్పించి పాత విధానంలోనే సిలిండర్లు ఇవ్వాలన్న దానిపై తీసుకున్న నిర్ణయంపై మాత్రం సమాచారం రాలేదు. దీనిని బట్టే కేంద్ర ప్రభుత్వ తీరులో ఏదో మతలబు ఉన్నట్లనిపిస్తోంది’ అని ఢిల్లీలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఇదీ పరిస్థితి...
రాష్ట్రంలో 1.70 కోట్ల మంది వంటగ్యాస్ వినియోగదారులుండగా 40 శాతం మంది (77 లక్షలు) ఆధార్‌ను అనుసంధానం చేసుకోలేదు. దీంతో వారంతా నష్టపోతున్నారు.
ఆధార్ లేని వినియోగదారులపై ఒక్కో సిలిండర్‌కు రూ. 771 అదనపు భారం పడుతోంది. 77లక్షల
మంది ఒక్కో సిలిండర్ తీసుకున్నట్లు పరిగణిస్తే మొత్తంగా రూ.593.67కోట్ల అదనపు భారం పడినట్లయింది.
పాత పద్ధతిలోనే సబ్సిడీ వంటగ్యాస్ అందించాలని కేంద్రం నిర్ణయించిందంటే నగదు బదిలీని నిలిపివేసినట్లే. ఇది అమలైతే ఆధార్ అనుసంధానమైన వారికి కూడా సిలిండర్‌పై రూ. 30 వరకూ అదనపు భారం తప్పుతుంది. అంటే ప్రస్తుతం నగదు బదిలీ ద్వారా వీరికి సబ్సిడీ సిలిండర్ ధర రూ. 478.87 పడుతోంది.
నగదు బదిలీ కాకుండా నేరుగా సబ్సిడీ సిలిండరు అందిస్తే వినియోగదారులకు లభించే బిల్లుకే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పడుతుంది. దీనివల్ల ప్రస్తుతం నగదు బదిలీ పరిధిలో ఉన్న 93 లక్షల మంది నెలకు సగటున రూ. 27.90 కోట్లు అదనంగా చెల్లిస్తున్నా రు.
సుప్రీం ఆదేశాలు బుట్టదాఖలు!
ఆధార్‌కు చట్టబద్ధతలేదని, దీనికి వంటగ్యాస్ సబ్సిడీతో లింకు పెట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశించి మూడునెలలైనా కేంద్రం పట్టించుకోవడంలేదు. ఎవరైనా కోర్టుకు వెళితే కోర్టు ధిక్కారం కింద ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో కేంద్ర కేబినెట్ ఆధార్‌తో లింకును వంటగ్యాస్‌కు రద్దుచేసినట్లు ప్రకటించింది. కానీ ఈ ఆదేశాలు అమలు చేయాలంటూ కంపెనీలకు ఆదేశాలు పంపడంలో మాత్రం జాప్యం చేస్తోంది. వీలైనంత జాప్యంతో సబ్సిడీని మిగిల్చుకోవాలన్నదే కేంద్రం ఉద్దేశమని ఆయిల్ కంపెనీల వారు అంటున్నారు. ఇది సుప్రీంను తప్పుదోవ పట్టించడమేననే విమర్శలు వినిపిస్తున్నాయి.