‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ ఎవరికీ వ్యతిరేకం కాదు: ఏపీఎన్జీవోల సంఘం
‘సేవ్ ఆంధ్రప్రదేశ్ అవగాహనా సదస్సు’ పేరిట ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సమైక్యాంధ్ర ఉద్యోగుల సభ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరినీ కించపరచడానికి కూడా కాదని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌బాబు, చంద్రశేఖరరెడ్డి స్పష్టంచేశారు. ఆదివారమిక్కడి ఏపీఎన్జీవో కార్యాలయంలో సభ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఉద్యోగుల సభను అడ్డుకుంటామంటున్నవారికి ఒకటే చెబుతున్నాం. మా సభ ఎవరికీ వ్యతిరేకం కాదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని, విభజన వల్ల జరిగే నష్టాలు, ఎదురయ్యే ఇబ్బందులను వివరించడానికే దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. సభ పెట్టొద్దనే హక్కు ఎవరికీ లేదు. మా సభ విజయవంతం అయితే మీ(విభజన) వాదనకు బలం లేనట్లే’’ అని పేర్కొన్నారు. విభజనకు ముందే పరిస్థితి ఇలా ఉంటే, విభజన తర్వాత పరిస్థితులు ఎలా మారతాయనే అంశంపై కేంద్రాన్ని నిలదీస్తామని వెల్లడించారు. రాజకీయ నాయకులు ఎవరైనా తమ సభకు రావచ్చని, అయితే పార్టీల జెండా, ఎజెండాలను పక్కనబెట్టి వస్తేనే ఆహ్వానిస్తామని స్పష్టంచేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిలుస్తున్న నాయకులు ఎవరైనా సభకు ఆహ్వానితులేనని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతం వారైనా సభకు రావొచ్చన్నారు. సభ నిర్వహణకు ఇప్పటి వరకు అనుమతి రాలేదని, తాము 15 రోజుల క్రితమే అనుమతి కోసం విజ్ఞప్తి చేశామని చెప్పారు.
సోమవారంలోగా అనుమతి రాకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. సభ నిర్వహణకు అనుమతి వస్తే స్టేడియంలో నిర్వహిస్తామని, లేకుంటే రోడ్డుపైనే ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సభ నిర్వహణ ఖర్చుల కోసం ఉద్యోగుల నుంచి చందాలు వసూలు చేస్తున్నామని, ఇందుకోసం ఒక్కొక్కటి రూ. 10 విలువైన 1.5 లక్షల కూపన్స్ ప్రింట్ చేయించామని వివరించారు. ఇంకా డబ్బు అవసరమైతే ఏపీఎన్జీవో సంఘం నుంచి ఖర్చు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్రకు చెందినవారు దాదాపు 40 లక్షల మంది ఉన్నారని, అందువల్ల పెద్ద సంఖ్యలో జనం సభకు వస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. ఆర్టీసీని, విద్యాసంస్థల్ని సమ్మె నుంచి మినహాయించాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ చేస్తున్న డిమాండ్ సమంజసమేనని వారు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఉద్యమ సమన్వయానికి జేఏసీ: సమాజంలోని అన్ని వర్గాలను సమన్వయపరుస్తూ సమైక్య రాష్ట్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి వీలుగా రాష్ట్రస్థాయిలో జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) కార్యవర్గాన్ని సోమవారం ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ఎన్జీవోలు నేతృత్వం వహించే ఈ కమిటీలో ఉద్యోగులతోపాటు న్యాయవాదులు, డాక్టర్లు, విద్యార్థులు, వ్యాపారులు, కార్మికులు.. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న అవగాహన సదస్సుకు హైదరాబాద్‌లోని సమైక్యవాదులు ఇంటికొకరు చొప్పున తరలి రావాలని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సమైక్య వాదాన్ని బలపరిచే కళాకారులు, గాయకులు కూడా ఈ సభకు హాజరుకావాలని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కోరారు. సభలో కళాకారులు, గాయకులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవోల నగర అధ్యక్షుడు సత్యనారాయణ, విద్యుత్‌సౌధ ఉద్యోగుల జేఏసీ నేత నాగప్రసాద్, సమైక్య న్యాయవాదుల జేఏసీ ప్రతినిధి వి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.