
‘రాయపాటి’కి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: చెల్లని చెక్‌లు ఇచ్చిన కేసులో తెలుగుదేశం పార్టీ నరసరావుపేట లోక్‌సభ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి దిగువ కోర్టులో సాగుతున్న విచారణపై గతంలో ఇచ్చిన స్టేను పొడిగించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.జి.శంకర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సాంబశివరావు దిగువ కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి... వ్యాపార అవసరాల నిమిత్తం ఐసీఐసీఐ బ్యాంకు నుంచి సాంబశివరావుకు చెందిన జయలక్ష్మి స్పిన్నింగ్స్ సంస్థ రూ. 31 కోట్ల మేర రుణం తీసుకుంది. బ్యాంకు ఈ మొత్తాన్ని చెక్ రూపేణా ఇచ్చింది. ఈ రుణం వాయిదాలను సాంబశివరావు తనకు చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్ కంపెనీ ద్వారా చెల్లించడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో బ్యాంకుకు రూ. 2 కోట్ల మొత్తానికి చెక్ ఇచ్చారు. తరువాత మరో రూ. 6 కోట్లకు మరో చెక్ ఇచ్చారు. అయితే ఈ రెండూ చెల్లకపోవడంతో బ్యాంకు రాయపాటి సాంబశివరావుపై 2006లో చేసిన ఫిర్యాదు మేరకు చెక్ బౌన్స్ కేసు నమోదైంది. దీనిపై నాంపల్లి కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాయపాటి హైకోర్టును ఆశ్రయించి... నాంపల్లి కోర్టులో విచారణపై స్టే ఉత్తర్వులు పొందారు. ఆ ఉత్తర్వుల గడువు తీరిపోవడంతో స్టే మరికొంత కాలం పొడిగించాలని అభ్యర్థిస్తూ రాయపాటి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె.జి.శంకర్ విచారించారు. స్టే పొడిగింపునకు నిరాకరిస్తూ అనుబంధ పిటిషన్‌ను కొట్టివేశారు. దీంతో రాయపాటి సాంబశివరావుపై దిగువ కోర్టులో సాగుతున్న విచారణకు అడ్డంకులు తొల గిపోయినట్లయింది. ఈ క్రిమినల్ కేసులో నాంపల్లి కోర్టు ఓసారి వ్యక్తిగత హాజరుకు ఇచ్చిన ఆదేశాలను రాయపాటి బేఖాతరు చేయడంతో ఆయనపై నాన్‌బెయిలబుల్ వారంట్లు కూడా జారీ చేసింది.