పామాయిల్ ధర పెంపు...కంటితుడుపే
=ఎన్నికల గిమ్మిక్కులో భాగమే
=మూడేళ్లుగా అడుగుతుంటే ఇప్పుడు నిర్ణయం
=రూ.57 కోట్ల బకాయిలపై మౌనం
నూజివీడు, న్యూస్‌లైన్ : మద్దతు ధర లేక నష్టాల బాటలో కూరుకుపోతున్న ఆయిల్‌పామ్ రైతులను బయట పడేయాల్సిన ప్రభుత్వం కంటితుడుపు చర్యలను మాత్రమే తీసుకుంటోంది. మద్దతు ధర కల్పించాలని నాలుగేళ్లుగా ఆయిల్‌పామ్ రైతులు పోరాడుతుండగా, ఇన్నాళ్లు మిన్నకుండిన ప్రభుత్వం ఇంకా మూడు నెలల్లో కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో ధరను పెంచామని చెప్పుకోవడానికా అన్నట్లు అరకొరగా పెంచిందని రైతులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ టన్ను ధర రూ.6,907 ఉంది. జాతీయ పరిశోధనా కేంద్రం చేసిన సిఫార్సే కనీసం టన్ను ధర రూ.8200 ఉండగా, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.609 పెంచి చేతులు దులుపుకుంది.
2010లోనే మద్దతు ధర పెంపుపై సూచన...
2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వ ధరల నిర్ణాయక కమిటీ చైర్మన్ అశోక్ గులాటి ఆయిల్‌పామ్ రైతులతో చర్చించిన మీదట క్రూడ్ పామాయిల్ ధరలో 13.54 శాతం చొప్పున రైతులకు టన్ను గెలలకు మద్దతు ధరను చెల్లించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులను ఇంతవరకూ ప్రభుత్వం పట్టించుకోకుండా సిఫార్సు చేసిన దానికంటే తక్కువగా 13.15 శాతం చెల్లించాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం టన్ను ఆయిల్‌పామ్ ధర రూ.609 పెరగనుంది.
మరోవైపు రైతు సంఘాలు గాని, ఆయిల్‌పామ్ రైతులు గాని రూ.16 శాతం చొప్పున ధరను నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయిల్‌పామ్ పంట రాష్ట్ర వ్యాప్తంగా 1.30 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా కృష్ణా జిల్లాలో 8 వేల హెక్టార్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 40 వేల హెక్టార్లు, ఖమ్మం జిల్లాలో 5 వేల హెక్టార్లలో సాగుచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి సమీపంలోని జాతీయ పరిశోధనా కేంద్రం ఆయిల్‌పామ్ సాగును క్షుణ్ణంగా పరిశీలించి టన్ను గెలలకు రూ.8200 చొప్పున ఇవ్వాలని ఐదేళ్ల క్రితం సిఫార్సు చేసింది. ఈ ధరను ఏటా 30 శాతం చొప్పున పెంచాలని కూడా సూచించింది. అప్పుడే దీన్ని సాగు చేస్తున్న రైతు నష్టాలపాలవకుండా ఉంటాడని తేల్చిచెప్పింది. ఇప్పటికీ దీనిని అమలుచేయడం లేదు.
రూ.57 కోట్ల బకాయిలపై ప్రభుత్వం మౌనం...
ఆయిల్‌పామ్ రైతులకు చెల్లించాల్సిన రూ.57 కోట్ల బకాయిల విషయమై ప్రభుత్వం మౌనంగా ఉంటోంది. 2009లో ఆయిల్‌పామ్ గెలలు టన్ను ధర రూ.6440 ఉండగా అదే ఏడాది ఫిబ్రవరిలో ఒక్కసారిగా ధర పతనమై టన్ను ధర రూ.4300కు పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్రం గోధుమలకు ఇచ్చినట్లుగా ఆయిల్‌పామ్ గెలలకు మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీం కింద రూ.5500 మద్దతు ధర నిర్ణయించింది. అంతకంటే తగ్గితే ఆ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించి రైతుకు చెల్లించేలా అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిలో భాగంగా 2009 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సంబంధించిన మొత్తం రూ.4.60 కోట్లను అప్పట్లో చెల్లించారు. అనంతరం 2009 మే నెల నుంచి 2010 వరకు ఏప్రిల్ వరకు ఆయిల్‌పామ్ రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.57 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని చెల్లించి తమను ఆదుకోవాలని రైతాంగం కోరినా పట్టించుకోవడం లేదు.