జిల్లా, మండల పరిషత్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఖరారు
రాష్ట్ర ఎన్నికల సంఘానికి చేరిన రిజర్వేషన్ల జాబితా
సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు
ముందే నోటిఫికేషన్‌కు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం వెలువడనుంది. జడ్పీ, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల జాబితా అందడంతో నోటిఫికేషన్ జారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కేసు సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుండటంతో ఆరోజు ఉదయమే నోటిఫికేషన్ జారీ చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం తప్ప మరో గత్యంతరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం వర్గాలు వివరించాయి. 22 జిల్లా పరిషత్‌లతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏయే కేటగిరీకి ఎన్ని రిజర్వ్ అవుతాయన్న జాబితాను పంచాయతీరాజ్ కమిషనర్ వరప్రసాద్ నేతృత్వంలో అధికారులు శనివారం ఖరారు చేశారు. రిజర్వేషన్ల జాబితాను ఎన్నికల సంఘానికి అందజేశారు. ఈ జాబితా ప్రకారం 22 జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాల్లో ఎస్టీలకు రెండు, ఎస్సీలకు నాలుగు, బీసీలకు ఏడు, అన్ రిజర్వ్‌డ్‌లో మహిళలకు నాలుగు, మరో ఐదు స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. మహిళలకు మొత్తం 11 స్థానాలు కేటాయించారు. 1,096 ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లో ఎస్టీలకు 122, ఎస్సీలకు 202, బీసీలకు 356, అన్ రిజర్వ్‌డ్ కేటగిరీలో 416 ఉన్నాయి. వీటిలో మహిళలకు 549 స్థానాలు ఉన్నాయి. ఇక 1,096 జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీలకు 101, ఎస్సీలకు 210, బీసీలకు 369, అన్ రిజర్వ్‌డ్ 416 ఉన్నాయి. వీటిలో మహిళలకు 553 సీట్లు కేటాయించారు. ఎంపీటీసీ సీట్లు మొత్తం 16,589 ఉండగా.. ఎస్టీలకు 1,483, ఎస్సీలకు 3,141, బీసీలకు 5,574, అన్ రిజర్వ్‌డ్ కింద 6,391 ఉన్నాయి. వీటిలో మహిళలకు 8,622 స్థానాలు కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇచ్చిన రిజర్వేషన్లను ఆది వారం రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే, సోమవారం సుప్రీంకోర్టులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కేసు విచారణ ప్రారంభమయ్యేలోగా నోటిఫికేషన్ జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
జెడ్పీ చైర్‌పర్సన్‌ల వివరాలు ఇవీ..
ఎస్టీ (మహిళ): విజయనగరం, ఎస్టీ: నల్లగొండ, ఎస్సీ (మహిళ): ఖమ్మం, వరంగల్, ఎస్సీ: వైఎస్సార్ జిల్లా, మహబూబ్‌నగర్, బీసీ(మహిళ): కరీంనగర్,ఆదిలాబాద్, గుంటూరు, మెదక్, బీసీ: నిజామాబాద్, కర్నూలు, అనంతపురం, అన్ రిజర్వ్‌డ్ (మహిళ): విశాఖపట్టణం, శ్రీకాకుళం, చిత్తూరు, కృష్ణా, అన్ రిజర్వ్‌డ్: రంగారెడ్డి, ప్రకాశం, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి.
రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
Published Sun, Mar 9 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
Advertisement