కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీ | Notification released for engineering admissions | Sakshi
Sakshi News home page

కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ జారీ

Published Thu, Jul 31 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

Notification released for engineering admissions

 ఇంజనీరింగ్ ప్రవేశాలకు 7 నుంచి ధ్రువీకరణ పత్రాల పరిశీలన
 23 వరకూ తనిఖీ.. ఉదయం 9 గంటల నుంచే ప్రక్రియ ప్రారంభం
 
 సాక్షి, హైద రాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. వచ్చే నెల 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. దీనికోసం ఇరు రాష్ట్రాల్లో కలిపి 57 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు ర్యాంకులవారీగా ఆయా కేంద్రాలకు హాజరుకావాల్సిన తేదీలను ప్రకటించారు. ట్యూషన్ ఫీజు, సీట్ల వివరాలను ఆప్షన్ల ప్రక్రియ చేపట్టడానికి ముందు ప్రకటిస్తామని వెల్లడించారు.
 
 ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ వివాదం నేపథ్యంలో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ గందరగోళంగా మారిన విషయం తెలిసిం దే. ఈ అంశంపై స్పష్టత వచ్చేలోగానే... ఇప్పటికే ఆలస్యమవుతోందంటూ ప్రవేశాల ప్రక్రియను చేపట్టేందుకు ఉమ్మడిగా కొనసాగుతున్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు ప్రవేశాల కోసం విద్యార్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలన చేపట్టేందుకు ఎంసెట్ కన్వీనర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు ఈ పరిశీలన చేపడుతున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీని ప్రకారం... ఎంసెట్-2014 (ఎంపీసీ స్ట్రీమ్)లో అర్హత సాధించిన తెలంగాణ, ఏపీ విద్యార్థులు ర్యాంకుల వారీగా నిర్ణీత తేదీల్లో హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల తనిఖీకి హాజరు కావాలి. దీనికి సంబంధించిన వివరాలను ఎంసెట్ వెబ్‌సైట్‌లో (జ్ట్టిఞట://్ఛ్చఝఛ్ఛ్టి.జీఛి. జీ)అందుబాటులో ఉంచారు. ప్రవేశాలకు సంబంధించి పూర్తి వివరాలను ఆగస్టు 5వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
 
 అన్ని పత్రాలతో హాజరుకావాలి..
 
 విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు వాటికి సంబంధించిన మూడు సెట్ల ప్రతులను సహాయక కేంద్రాలకు తీసుకురావాల్సి ఉంటుంది. ఎంసెట్ ర్యాంక్ కార్డు, హాల్‌టికెట్, ఇంటర్మీడియట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్, ఎస్సెస్సీ లేదా తత్సమాన మార్కుల మెమో, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, 2014 జనవరి 1వ తేదీ తరువాత జారీ చేసిన ఆదాయ ధ్రువపత్రం, కుల ధ్రువీకరణ పత్రం, పీహెచ్/ఎన్‌సీసీ/స్పోర్ట్స్ తదితర అభ్యర్థులు సం బంధిత ధ్రువపత్రాలను తీసుకురావాలి. ఓసీ, బీసీ అభ్యర్థు లు రూ. 600, ఎస్సీ, ఎస్టీలు రూ. 300 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు వివరాలు, కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉండే సీట్ల వివరాలను ఆప్షన్ల ప్రక్రియకు ముందుగా ప్రకటిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన ఆయా తేదీల్లో ప్రతి రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. వికలాంగులు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ తదితర కేటగిరీల వారికి హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యా భవన్‌లో సర్టిఫికెట్ల తనిఖీ ఉంటుంది. కాగా, ధ్రువపత్రాల పరిశీలన కోసం తెలంగాణలో 23, ఆంధ్రప్రదేశ్‌లో 34  హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడించారు.
 
 సవరణలు చేశాకే..
 
 ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు (జీవోలు 66, 67, 74, 75) సవరణ చేసి... ఉత్తర్వులు జారీ చేశాకే తెలంగాణ, ఏపీల్లోని ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లలో ప్రవేశాలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అంతవరకు యాజమాన్య కోటాలో ఎలాంటి ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదని పేర్కొంది.
 
 బహిష్కరిస్తాం..: పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం
 
 ఎంసెట్ ప్రవేశాల అంశంలో ఏపీ ప్రభుత్వ ప్రోద్భలంతో ఉన్నత విద్యామండలి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నందున తెలంగాణలో హెల్ప్‌లైన్ కేంద్రాలను తె రవబోమని తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ధ్రువపత్రాల పరిశీలనను బహిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అసోసియేషన్ నాయకులు వై.నర్సయ్యగౌడ్, మనోహర్‌రెడ్డి, కేఎస్ చక్రవర్తి, సీహెచ్ మధుసూదన్‌రెడ్డి తదితరులు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్‌కు, విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డికి తెలియజేశారు. బుధవారం సచివాలయంలో మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ.. ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
 
 టీ సర్కార్‌ను బద్‌నాం చేసే కుట్ర: తెలంగాణ వికాస సమితి
 
 తెలంగాణ ప్రభుత్వాన్ని బద్‌నాం చేసే కుట్రలో భాగంగానే ఇంజనీరింగ్ ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేశారని తెలంగాణ వికాస సమితి నాయకులు దేశపతి శ్రీనివాస్, పాపిరెడ్డి, వీరన్న, విజయభాస్కర్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫీజులకు సంబంధించి ఎలాంటి జీవోలు జారీ చేయకుండా నోటిఫికేషన్‌ను విడుదల చేయడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంపై విద్యార్థులను ఉసిగొల్పేందుకే నోటిఫికేషన్ విడుదల చేశారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement