
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్ నత్వానీ మంగళవారం నాడు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఏపీ నుంచి పెద్దల సభకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయం వల్లనే తనకు మూడోసారి రాజ్యసభకు వెళ్లే అరుదైన అవకాశం దక్కిందన్నారు.
సీఎం ఏ బాధ్యత అప్పగించిన తన వంతుగా ముందుండి పూర్తిచేస్తానని అన్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను తీసుకురావడంలో సీఎం జగన్ చెప్పినట్లు పనిచేస్తూ సాధించుకుంటామని తెలిపారు. తనకున్న అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న వైఎస్ జగన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. పార్టీ ఎంపీలతో కలిసి టీమ్ వర్క్ చేస్తూ రాష్ట్రం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని' ఎంపీ నత్వానీ వెల్లడించారు. చదవండి: సీఎం జగన్‌కు ధన్యవాదాలు : పరిమల్