పౌరసరఫరాలపై నిఘా
సాక్షి, కడప : పౌర సరఫరాల శాఖలో నూతన శకానికి నాంది పలకనున్నారు. అవినీతిని ఏరివేసి అక్రమాలను నిరోధించడమే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను అమలు చేసేందుకు కసరత్తుచేస్తున్నారు. తద్వారా రవాణాకు సంబంధించి సరుకుతో బయలుదేరిన వాహనాలు పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థ పనిచేస్తోంది.
మార్చినుంచి జీపీఎస్ సిస్టమ్‌ను అమలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే పౌరసరఫరాలశాఖకు సంబంధించిన కంప్యూటర్లు కూడా జిల్లాకు వచ్చి చాలారోజులైంది. జిల్లాలోని సుమారు 19 గోడౌన్లలో కంప్యూటర్లు ఏర్పాటుచేయాల్సి ఉండగా ఇంతవరకు పట్టించుకోవడంలేదు.
రేషన్‌షాపుల్లో బయో మెట్రిక్
జిల్లాలో 7.26 లక్షల పైచిలుకు రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే యూఐడీ నెంబరు లేకుండా ఉన్న 8726 యూనిట్లను ఆధార్ అనుసంధానం నేపధ్యంలో తొలగించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 1725 రేషన్‌షాపులకు సంబంధించి త్వరలోనే బయో మెట్రిక్ విధానం అమలులోకి రానుంది. ఇప్పటికే బయో మెట్రిక్ సిస్టమ్‌లో భాగంగా అన్ని రేషన్ షాపుల్లో బయో మెట్రిక్ మిషన్లను బిగించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎఫ్‌పీ షాపులకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్లను ఇప్పటికే అధికారులు సేకరించి బయో మెట్రిక్‌కు సంబంధించిన కాంట్రాక్టర్‌కు అందజేశారు.
ఫిబ్రవరి నుంచి అమలుకు కసరత్తు
రేషన్‌షాపుల ద్వారా బయో మెట్రిక్ విధానాన్ని ఫిబ్రవరి నుంచి అమలు చేసేందుకు పౌరసరఫరాలశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల జనవరి నుంచి ప్రారంభం కానుండగా, మరికొన్ని జిల్లాల్లో ఫిబ్రవరి నుంచి అమలు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ-పాస్ విధానంతో దాదాపు బోగస్‌కు చెక్‌పడినట్లేనని అధికారులు భావిస్తున్నారు.
నిరుపయోగంగా కంప్యూటర్లు
జిల్లాకు సంబంధించి పౌరసరఫరాల గోడౌన్లలో బిగించాలని కడపకు కంప్యూటర్లు వచ్చినా దాదాపు నెలన్నర కాలంగా ఉన్నాయి. వాటిని గోడౌన్లలో బిగించాల్సి ఉన్నా కరెంటు సౌకర్యంలేని నేపధ్యంలో కంప్యూటర్లను నిరుపయోగంగా ఉంచారు. కంప్యూటర్లకు జీపీఎఫ్ సిస్టమ్‌కు అనుసంధానం చేసి ఆన్‌లైన్ చేయడం ద్వారా వాహన రవాణాను ఎప్పటికప్పుడు పసిగట్టడానికి వీలవుతుంది. పైగా చాలా గోడౌన్లకు కరెంటు సరఫరా లేకపోవడంతో కంప్యూటర్లను ఎప్పుడు బిగిస్తారో అధికారులకే ఎరుక.
బెంగుళూరు నుంచి వస్తున్న యంత్రాలు : ప్రభాకర్‌రావు, డీఎస్‌ఓ
బెంగుళూరు నుంచి బయోమెట్రిక్ మిషన్లు కడపకు త్వరలోనే వస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ప్రభాకరరావు తెలియజేశారు. సుమారు 1726 మిషన్లు బెంగుళూరు నుంచి కాంట్రాక్టర్ తీసుకు వస్తున్నారని, అనంతరం వాటిని రేషన్‌షాపుల్లో ఏర్పాటు చేస్తారని తెలియజేశారు. వాటితోపాటు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు కూడా వస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా షాపుల్లో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలను సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.