
పవిత్రత గోవిందా!
నిత్యం గోవింద నామస్మరణలతో మార్మోగుతున్న తిరుపతిలో అడు గు పెట్టే భక్తులు ఎంతో పవిత్రంగా తిరుమలకు చేరుకోవాలని భావిస్తారు.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉన్న తిరుపతి నగరంలో పవిత్రతను మంటగలిపేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. తిరుమలకు వెళ్లే మార్గాలకు వంద అడుగుల దూరంలో మద్యం షాపులకు అనుమతులు ఇచ్చింది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : నిత్యం గోవింద నామస్మరణలతో మార్మోగుతున్న తిరుపతిలో అడు గు పెట్టే భక్తులు ఎంతో పవిత్రంగా తిరుమలకు చేరుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిని మద్యరహిత నగరంగా ప్రకటించాలని గతంలో పలు ఆందోళనలు జరిగాయి. అప్పటి ప్రభుత్వం దిగివచ్చి భక్తులు, యాత్రికులు ప్రయాణించే ప్రధాన మార్గాల్లో మద్యం దుకాణాలు, బార్లు తొలగిస్తూ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పరిణామంతో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు, యాత్రికులు, స్థానికులూ సంతోషించారు.
ఆ మార్గాలు భక్తులు, యాత్రికుల రాకపోకలతో ఆధ్మాత్మిక శోభను సంతరించుకున్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం భక్తుల మనోభావాలను తుంగలో తొక్కి తిరిగి ఆ మార్గాలకు సమీపం లోనే మద్యం షాపుల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. గతంలో అడ్డంకిగా మారిన నిబంధనలకు తిలోదకాలిస్తూ తమకు అనుకూలంగా మార్పులు తీసుకువచ్చింది. తిరుపతి పవిత్రతను మంటగలుపుతూ మద్యం షాపులు, బార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గతంలో మద్యం షాపులను రద్దు చేసిన కూడళ్లు ఇవే..
తిరుపతికి వచ్చే భక్తులు రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్, పూర్ణ కుంభం సర్కిల్ నుంచి శ్రీనివాసం, లీలామహల్ సర్కిల్, కపిల తీర్థం మీదుగా తిరుమలకు వెళతారు. అలాగే టౌన్ క్లబ్ నుంచి స్విమ్స్ సర్కిల్ మీదుగా అలిపిరి ద్వారా కొంతమంది తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి భక్తులు, యాత్రికులు ప్రయాణించే ఈ మార్గాల్లో ఒకప్పుడు మద్యం దుకాణాలను యథేచ్ఛగా నడిపేవారు. వివిధ రూపాల్లో పోస్టర్లను ఉంచి, భక్తులను ఆకట్టుకునేవారు.
ఈ క్రమంలో కొంతమంది భక్తులు తిరుమలకు వెళ్లకుండా నేరుగా మద్యం షాపులకు వెళ్లి, తిరుపతి పవిత్రతకు భంగం కలిగించేవారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో పూర్తిగా మద్యం షాపులు ఉండకూడదన్న ఉద్యమం మొదలైంది. అదే క్రమంలో తిరుపతి పవిత్రను దృష్టిలో ఉంచుకుని తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా బ్రాందీ షాపులు ఉండకూదని కోర్టులో ఫిల్ వేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిరాహారదీక్ష సైతం చేశారు.
అప్పుడు దిగి వచ్చిన ప్రభుత్వం భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని హామీల కమిటీని నియమించింది. ఆ కమిటీ తిరుపతిలో పర్యటించి, తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని షాపులను ఎత్తివేయాలని సూచించింది. ఈ మేరకు అప్పటి కలెక్టర్ 2012లో 18 మద్యం షాపులు, 2014లో 9 బార్ల అనుమతులను రద్దుచేశారు. తిరుమలకు ప్రయాణించే మార్గాల్లో ఉన్న వార్డుల్లో పూర్తిగా మద్యం షాపులను ఎత్తివేశారు.
ఇప్పుడు ఆ నిబంధనలను కాస్త సడలించి రోడ్డుకు 100 అడుగుల దూరంలో మద్యం షాపులకు అనుమతులను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తిరుమలకు వెళ్లే దారుల్లో సైతం తిరిగి మద్యం ఏరులై పారనుంది. తిరుమల ప్రాశస్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిషేధిత మార్గాలకు సమీపంలో మద్యం షాపుల అనుమతుల ఉత్తర్వులు రద్దు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు.