
సూర్యారావుపేట (విజయవాడ సెంట్రల్): సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు తెలుగుదేశం ప్రభుత్వంతో ప్రాణహాని ఉందని అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం అధ్యక్షుడు సుంకర శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీకి చెందిన ఎల్లో మీడియా అనుచరుల ద్వారా ఆయనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా టీడీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
విజయవాడలోని అమరావతి రాష్ట్ర కాపునాడు సంఘం కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాలుగేళ్ల ప్రభుత్వ వైఫల్యాలను పవన్ వెల్లడిస్తే, సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ జీర్ణించుకోలేక వెకిలిచేష్టలు చేస్తున్నారని విమర్శించారు. కొన్ని మీడియా సంస్థలకు లోకేష్ ఇచ్చిన కోట్ల రూపాయిలను పంచారని ఆరోపించారు. పవన్‌కు అమరావతి రాష్ట్ర కాపునాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.