దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి
ఆనందపేట (గుంటూరు) : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులు, గిరిజనులపై దాడులు ఎక్కువయ్యాయని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 జయంతోత్సవాల సందర్భంగా బుధవారం బ్రాడీపేటలోని మహిమగార్డెన్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తొలుత అంబేడ్కర్, బాబుజగ్జీవన్‌రామ్, జ్యోతిరావుపూలే, మాహత్మగాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ దళితుల్లో భరోసా కలిగించేందుకు 13 జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నీరుగారుస్తూ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్నారు. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ భావజాలాలను రక్షించుకోవాల్సిన అవశ్యకత ఏర్పడిందన్నారు.
కాంగ్రెస్‌పార్టీ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండా ఉంటుందని తెలిపారు. జాతీయ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మాట్లాడుతూ దళితులకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేసే పార్టీ కాంగ్రెస్ అన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలకనుగుణంగా ముందుకు సాగుతూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. కేంద్ర మాజీ మంత్రి పిల్లి కృపారాణి మాట్లాడుతూ చంద్రబాబును చరిత్ర క్షమించదన్నారు.
శాసనమండలి ప్రతిక్ష నాయకుడు సి.రామచంద్రయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, రాక్షసపాలన సాగుతుందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు కె.వి.రామచంద్రరావు మాట్లాడుతూ అంబేడ్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయాలకనుగుణంగా కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, శైలజనాధ్, కాసుకృష్ణారెడ్డి, రాజసభసభ్యుడు జేడీశీలం, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, నగర అధ్యక్షుడు మాదా ముత్యాలరావు, పార్టీ నాయకులు కొరివి వినయ్‌కుమార్, షేక్ మస్తాన్‌వలి, తదితరులు పాల్గొన్నారు.