‘బీజేపీ మంత్రులపై దేశ ద్రోహం కేసు పెట్టాలి’
అనంతపురం రూరల్ : జాతిపిత గాంధీని చంపిన గాడ్సేకు గుడికడతామని ప్రకటించిన బీజేపీ మంత్రులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని రాష్ర్ట మానవహక్కుల వేదిక ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కన్హయ్ కుమార్‌పై రాజద్రోహం - కేంద్రప్రభుత్వ వైఖరి అనే ఆంశంపై ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మధు అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం... సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ మృతికి కారకులైన వారిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడవడమేనని అన్నారు.
దేశ సమస్యలపై ప్రశ్నించిన వారిపై దేశ ద్రోహం కేసులు పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. వెంటనే కన్హయ కుమార్‌పై పెట్టిన కేసులను ఎత్తివేసి బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారత శిక్షాస్మృతిలో అత్యంత క్రూరమైన సెక్షన్ 124ను వెంటనే తొలగించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజాస్వామిక వాదులు పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, ఐఎన్‌టీయూసీ రమణ, ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, బండి పరశురాంతో పాటు, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.