
సాక్షి, అమరావతి : గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ప్రశ్న పత్రాలు బయటకి రావడానికి అవకాశమే లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని తెలిపారు. అయితే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొంతమంది చేస్తున్న లీకు అంటూ ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల ఎంపిక కోసం పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించినట్టు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. లీకు ఆరోపణలు వాస్తవం కాదన్నారు. పరీక్షల నిర్వహణను అన్ని మీడియాల ప్రతినిధులు కూడా ప్రశంసించిన విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు.