యాదృచ్ఛికమే కావొచ్చుగానీ... జాతీయ స్థాయి పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు వరసపెట్టి లీక్ అవుతున్న తరుణంలోనే ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఎంపిక వ్యవహారం బద్దలై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేసి నాలుగేళ్ల క్రితం రిటైరైన ప్రీతి సుదాన్‌కు సంస్థ సారథ్యం అప్పగించారు. ఆమె యూపీఎస్సీని చక్కదిద్దుతారన్న నమ్మకం అందరిలోవుంది.సాధారణంగా ప్రశ్నపత్రాల లీక్ ఉదంతాలు చోటుచేసుకున్నప్పుడల్లా యూపీఎస్సీని అందరూ ఉదాహరణగా చూపేవారు. దాన్ని చూసి నేర్చుకోవాలని హితవు పలికేవారు.
అలాగని యూసీఎస్సీపై అడపా దడపా ఆరోపణలు లేకపోలేదు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నట్టు చూపటం, తప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు దాఖలుచేయటం వంటి మార్గాల్లో అనర్హులు సివిల్ సర్వీసులకు ఎంపికవు తున్నారన్న ఆరోపణలు అధికం. ఫలితాల ప్రకటనలో ఎడతెగని జాప్యం సరేసరి. అయితే వీటికిసంతృప్తికరమైన సంజాయిషీలు రాలేదు. పరీక్ష నిర్వహణ మాటెలావున్నా ధ్రువీకరణ పత్రాల తనిఖీకి ఆ సంస్థ పకడ్బందీ విధానాలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో క్రమంలో పొరపాట్లు చోటుచేసుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. వెనువెంటనే ఆరా తీసి సరిదిద్దుకుంటే అవి పునరావృతమయ్యే అవకాశాలు ఉండవు.
విమర్శలు, ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ తక్షణం స్పందించే లక్షణం ఉండాలంటే జవాబుదారీతనం, పారదర్శకత తప్పని సరి. అవి లోపించాయన్నదే యూపీఎస్సీపై ప్రధాన ఫిర్యాదు. ఒకపక్క అభ్యర్థులకు నైతిక విలువల గురించి ప్రశ్నపత్రం ఇస్తూ అలాంటి విలువలు సంస్థలో కిందినుంచి పైవరకూ ఉండటంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని గుర్తించకపోతే అంతిమంగా న ష్టం కలిగేది సంస్థకే. పూజ గురించిన వివాదాలు సామాజిక మాధ్యమాల్లో బయటికొచ్చాక ఇప్పటికే సర్వీసులో చేరిన కొందరిపై ఆరోపణలు వెల్లు వెత్తాయి.
కాళ్లకు సంబంధించి అంగ వైకల్యం ఉన్నట్టు చూపి ఉద్యోగం పొందారంటూ ఒక అధికారి వీడియో బయటికొచ్చింది. అందులో ఆయన నిక్షేపంగా ఉండటమేగాక సైక్లింగ్, రన్నింగ్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఆయన నిజంగానే అలాంటి తప్పుడు పత్రంతో చేరారా లేక ఆ అధికారిపై బురద జల్లారా అనేది తెలియదు. తక్షణం స్పందించే విధానం రూపొందించుకుంటే తప్పుడు ఆరోపణలు చేసినవారిపై చర్య తీసుకునే వీలుంటుంది. లేదా సంబంధిత అధికారినుంచి సంజాయిషీ కోరే అవ కాశం ఉంటుంది. రెండూ లేకపోతే ఎవరికి తోచినవిధంగా వారు అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
యూపీఎస్సీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మనోజ్ సోనీ రాజీనామా ఉదంతంలో కూడా సక్రమంగా వ్యవహరించలేదు. నిరుడు మే 16న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సోనీ అయిదేళ్ల కాల వ్యవధికి చాలా చాలా ముందే ఎందుకు తప్పుకున్నారు? చూసేవారికి స్పష్టంగా పూజ ఎంపిక వ్యవహారం తక్షణ కారణంగా కనబడుతుంది. కానీ ఆ సంస్థ అదేం కాదంటోంది. ‘వ్యక్తిగత కార ణాలే’ అని సంజాయిషీ ఇస్తోంది. అటు కేంద్రం సైతం ఏమీ మాట్లాడదు. దీనివల్ల ప్రజల్లో అనుమా నాలు తలెత్తితే... మొత్తంగా అది సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయదా? అభ్యర్థులు తాము బాగా రాసినా అక్కడేదో జరిగిందన్న అపోహలుపడే పరిస్థితి తలెత్తదా?
అసలు ఇలాంటివి జరుగుతున్నాయన్న నమ్మకాలు బలపడితే అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకూ, ఆ తర్వాత ఇంటర్వ్యూలకూ హాజరు కాగలరా? నూతన సారథి ఈ అంశాలపై ఆలోచన చేయాలి. పూజ ఉదంతంలో కోల్పోయిన విశ్వసనీయతను పెంపొందించుకోవటానికి ఏమేం చర్యలు అవసరమన ్న పరిశీలన చేయాలి. అభ్యర్థుల మదింపు విషయంలో అనుసరించే విధానాల గురించి... ముఖ్యంగా వారి జవాబుపత్రాల దిద్దుబాటుకూ, ఆ తర్వాత జరిగే ఇంటర్వ్యూలో అభ్యర్థులిచ్చే జవాబుల ద్వారా వారి శక్తియుక్తు లనూ, సామర్థ్యాన్ని నిర్ధారించే పద్ధతులకూ ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారో తెలపాలి.
చదువుల్లో, సమస్యలను విశ్లేషించే సామర్థ్యంలో మెరికల్లా ఉండటం, సమాజంలో అపరిష్కృతంగా మిగిలిపోతున్న అంశాల విషయంలో ఏదో ఒకటి చేయాలన్న తపన, తాపత్రయంఉండటం, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించటం సివిల్ సర్వీసుల అభ్యర్థులకు అవసరమని చాలా మంది చెబుతారు. నిజానికి ఈ సర్వీసుల్లో పనిచేసేవారి జీతభత్యాలకు అనేక రెట్లు అధికంగా సాఫ్ట్‌వేర్ రంగంలో లేదా వ్యాపారాల్లో మునిగితేలేవారు సంపాదిస్తారు. అందుకే ఎంతో అంకిత భావం ఉండేవారు మాత్రమే ఇటువైపు వస్తారు. కానీ అలాంటివారికి యూపీఎస్సీ ధోరణి నిరాశ కలిగించదా?
నీతిగా, నిజాయితీగా పాలించటం చేతకాని పాలకుల ఏలుబడిలో పనిచేయాల్సి వచ్చి నప్పుడు సర్వీసులో కొత్తగా చేరిన యువ అధికారులు ఎంతో నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. అసలు యూపీఎస్సీయే నిర్లక్ష్యం లోనికో, నిర్లిప్తత లోనికో జారుకుంటే ఎవరిని నిందించాలి? పూజా ఖేడ్కర్‌కు సంబంధించి ఇంకా దోష నిర్ధారణ జరగలేదు. ప్రస్తుతం ఆమె కేవలం నిందితురాలు మాత్రమే. పునః శిక్షణకు రావాలన్న సూచనను బేఖాతరు చేయటంతో ఇప్పటికే యూపీఎస్సీ ఆమె ఎంపికను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
మరోపక్క పోలీసులూ, యూపీఎస్సీ నియమించిన కమిటీ ఆమె సమర్పించిన ధ్రువీకరణ పత్రాలపై ఆరా తీస్తున్నారు. ఆమె ముందస్తు బెయిల్ దరఖాస్తును న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పరిణామంతో ఆమె దుబాయ్‌కి పరారీ అయ్యారన్న కథనాలు కూడా మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ఉదంతంలోనైనా జరిగిందేమిటో వివరిస్తే, ఇది పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలేమిటో చెబితే యూపీఎస్సీపై విశ్వసనీయత పెరుగుతుంది. దాని ప్రతిష్ఠ నిలబడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment