సాక్షి, విజయవాడ: ఐదేళ్లలో విజయవాడను ఆదర్శనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. బుధవారం విజయవాడలో కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి రాణిగారి తోట వరకు ఆరున్నర కోట్లతో మంచినీటి పైప్‌లైన్ పనులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. వీరికి మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండని కోరారు. ఈ కార్యక్రమానికి వైస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, నగరాధ్యక్షులు బొప్పన భవకుమార్ హాజరయ్యారు.
టీడీపీ నిజాలు మాట్లాడదని తెలిసిపోయింది
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రాష్ట్రాన్నిసమగ్రాభివృద్దివైపు నడిపించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. జగన్ పాలనలో పేదల కష్టాలు కడతేరిపోతాయని పేర్కొన్నారు. ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైన విజయవాడ అభివృద్ధికి ఆయన అవసరమైన నిధులు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విజయవాడ అభివృద్ధికి బంగారుబాటలు పడ్డాయన్నారు. టీడీపీ పాలనలో పట్టిన గ్రహణం వీడిందని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాజధాని డ్రామా ఫెయిల్ కావడంతో ఇప్పుడు జనచైతన్య యాత్ర డ్రామా మొదలు పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజలు స్పందించరని స్పష్టం చేశారు. టీడీపీ నిజాలు మాట్లాడదన్న సత్యాన్ని గ్రహించే జనం వారికి గుణపాఠం చెప్పారన్నారు.
రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగరేస్తాం
దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్పోరేటర్లు ఉన్న డివిజన్లను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చూపారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందన్నారు. కృష్ణలంక కరకట్ట నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. రాబోయే కార్పోరేషన్ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో విజయకేతనం ఎగురవేస్తామన్నారు. బొప్పన భవకుమార్ మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా మంచినీటి పైప్‌లైన్‌కు శంకుస్థాపన చేయడం శుభపరిణామమన్నారు. ఆర్భాటాలు టీడీపీ సొంతమైతే.. అన్ని ప్రాంతాల అభివృద్ధి మా నైజమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment