అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి
మర్రిపాడు: అర్హులైన ప్రతిఒక్కరికీ సామాజిక పింఛన్లు ఇవ్వాల్సిందేనని నెల్లూరు లోక్‌సభ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. పింఛన్ల జాబితాల నుంచి అర్హులను తొలగిస్తే ఊరుకునేది లేదని, ఇప్పటికే ఎవరినైనా తొలగించి ఉంటే ఆ పేర్లను పునరుద్ధరించాలని ఆయన సూచించారు.
ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి, బూదవాడ గ్రామాల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డిలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లిలో ఆయన మాట్లాడుతూ 2015 నాటికి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామంలో పారిశుధ్యం నిర్మూలనకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పాఠశాలలో బాలబాలిలకలకు మరుగుదొడ్లు సౌకర్యం కల్పించాలని సూచించారు. బడిఈడు పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయ పనిముట్లను, ఎరువులను సక్రమంగా అందించాలని అధికారులకు సూచించారు.
జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య నిర్మూలనకు కృషి చేస్తామని, విద్యకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు గుర్తించి పరిష్కరిస్తామన్నారు. గ్రామాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
స్టాల్స్ ప్రారంభించిన ఎంపీ : అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రారంభించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భవతులకు సీమంతాలు నిర్వహించారు. మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పశువైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సౌలభ్యంగా మందులు పంపిణీ చేయాలని కోరారు. ఎంపీపీ కటారి రమణయ్య, సర్పంచ్ కన్నపురెడ్డి అమర్‌నాథ్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు నారపరెడ్డి ఈశ్వర్ రెడ్డి, ఎంపీడీఓ నిర్మలాదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ లీలాప్రకాష్, వ్యవసాయ అధికారి జహీర్, వైద్యాధికారి శ్రీనివాసులురెడ్డి, ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటలక్ష్మి, ట్రాన్స్‌కో ఏఈ , పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతరం బూదవాడలో అర్హులైన పేదలకు పింఛన్లు అందజేశారు. ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డి వర్షంలోనే వృద్ధులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన పేదలు అందరికి పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముటుకుందు వసంత, ఎంపీటీసీ సభ్యులు ఆళ్ల రమణయ్య, స్థానిక వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ నాయకులు ముటుకుందు లక్ష్మీరెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.