
అనుమానం పెనుభూతం
బేతపూడి (ఫిరంగిపురం)
అనుమానం పెనుభూతమైంది. పదేళ్ల దాంపత్య జీవితంలో ఇటీవల అనుమానం బీజం మొగ్గతొడిగింది. ఈ క్రమంలో భర్త తన భార్యపై కక్ష పెంచుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో రోకలిబండతో తలపై మోది దారుణంగా హతమార్చిన సంఘటన బేతపూడి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ దారుణ ఘటనతో స్థానికులు విస్తుపోయారు.
ఎస్‌ఐ పి.ఉదయబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన మారపాకల నరసింహారావు వంట పనిచేస్తుంటాడు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం భార్యాపిల్లలతో గుంటూరు జిల్లాకు వలస వచ్చాడు. వినుకొండ సమీపంలోని చీమలమర్రిలో కొన్నాళ్లు ఉండి సత్తెనపల్లికి మారాడు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా రాయలచెరువుకు చెందిన కోరంపల్లి నాగన్న కుమారుడు గురుప్రసాద్ వంట పని వద్ద పరిచయమయ్యాడు.
ఆ పరిచయంతో పదేళ్ల క్రితం తన పెద్దకుమార్తె సుజాతను గురుప్రసాద్‌కు ఇచ్చి వివాహంచేశాడు. అల్లుడిని కూడా తనతోపాటు వంట పనులకు తీసుకువెళుతుండేవాడు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా అద్దంకిలో నివాసం ఉన్నారు. గురుప్రసాద్ దంపతులకు ఇద్దరు కుమారులు గణేష్, లోకేష్ ఉన్నారు. అక్కడే గురుప్రసాద్ సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. కొన్నాళ్ల క్రితం నరసింహారావు మృతిచెందడంతో ఆయన భార్య ఈశ్వరమ్మ పెద్దకుమార్తె సుజాత ఇంట్లో ఉంటోంది.
ఈ క్రమంలో ఏడునెలల క్రితం మండలంలోని బేతపూడి గ్రామానికి గురుప్రసాద్ కుటుంబం వచ్చి అద్దెఇంట్లో ఉంటోంది. అత్తంటి బంధువుల సహకారంతో న్యూడిల్స్ బండి పెట్టుకుని గురుప్రసాద్ జీవనోపాధి పొందుతున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న గురుప్రసాద్ దాంపత్య జీవితంలో ఇటీవల భార్యపై ఆయనకు అనుమానం కలిగింది.
పక్క ఇంటి వ్యక్తి ఒకరు తన ఇంటి మెట్ల వద్ద తచ్చాడుతూ గురుప్రసాద్‌కు కనింపించాడు. ఈ ఘటన తన భార్యపై అనుమానాన్ని కలిగించింది. ఇదే విషయం భార్యను అడగ్గా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పది రోజుల క్రితం పిల్లలిద్దరినీ తీసుకుని గురుప్రసాద్ స్వగ్రామం రాయలచెరువు వెళ్లాడు. రెండువర్గాల పెద్దలు సర్దిచెప్పి వెంటనే ఇక్కడకు తీసుకువచ్చారు. అయినా భార్యపై అనుమానం తొలిగిపోలేదు.
ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. శుక్రవారం ఉదయం పిల్లలిద్దరూ పాఠశాలకు వెళ్లగా.. ఈశ్వరమ్మ సరుకులు కోసం సత్తెనపల్లి వెళ్లింది. ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి వచ్చిన గురుప్రసాద్ ఒంటరిగా ఉన్న భార్య సుజాత తలపై రోకలిబండతో గట్టిగా మోది పరారయ్యాడు. పాఠశాలకు వెళ్లిన ఇద్దరు పిల్లల్లో చిన్నకుమారుడు లోకేష్ ఇంటికి వచ్చి తల్లి వద్దకు వెళ్లాడు. రక్తపుమడుగులో ఉన్న తల్లిని చూసి ఆరేళ్ల లోకేష్ కేకలు పెడుతూ బయటకు పరుగులు తీశాడు. చట్టుపక్కలవారు గమనించి సుజాత తల్లి ఈశ్వరమ్మకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న గ్రామనౌకరి షేక్ ఖాదర్‌వలి ఎస్‌ఐ పి.ఉదయబాబుకు తెలియపర్చారు. వెంటనే ఎస్‌ఐ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.