శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించి మూడురోజులవుతున్నా ఘటనాస్థలం వద్ద జనం తాకిడి తగ్గలేదు. వేలాదిగా జనం వచ్చి ప్రమాద స్థలాన్ని చూసి ఘటనపై ఆరా తీస్తున్నారు.
నంద్యాల, న్యూస్‌లైన్: శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించి మూడురోజులవుతున్నా ఘటనాస్థలం వద్ద జనం తాకిడి తగ్గలేదు. వేలాదిగా జనం వచ్చి ప్రమాద స్థలాన్ని చూసి ఘటనపై ఆరా తీస్తున్నారు. బుధవారం రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తూ గూబగుండం మెట్ట దగ్గర శోభానాగిరెడ్డి వాహనం బోల్తాపడి ఆమె మరణించిన విషయం తెలిసిందే. అయితే సంఘటన ఎలా జరిగిందని నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తున్న వాహనాల యజమానులు అక్కడ నిలబడి చూసి వెళ్తున్నారు. వాహనం నాలుగు పల్టీలు కొట్టిందని సమాచారం ఉండటంతో ఎక్కడ బ్రేక్ పడింది.. ఎందుకు డ్రైవర్ బ్రేక్ వేశాడంటూ చర్చించుకుంటున్నారు. అంతేగాక శోభానాగిరెడ్డి మృతికి కారణమైన అంశాన్ని కూడా ప్రమాదానికి గురైన వాహనాన్ని చూస్తూ చర్చించుకున్నారు. ప్రమాదానికి కారణంగా చెబుతున్న ఆరబోసిన వడ్లు కూడా అలాగే ఉండటంతో చర్చనీయాంశమైంది. బోల్తా పడిన వాహనం ఘటనాస్థలంలోనే ఉండడంతో వేలాదిగా జనం వచ్చి చూస్తూ ప్రమాదంపై చర్చించుకుంటున్నారు.
శోభమ్మే లక్ష్యంగా వెంటాడిన మృత్యువు :
ప్రమాద సమయంలో శోభానాగిరెడ్డితోపాటు వాహనంలో ఉన్న గన్‌మేన్‌లు, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారని, వారిలాగే శోభమ్మ కూడా గండం నుంచి బయటపడి ఉంటే బాగుండేదని ఘటనాస్థలం వద్ద జనం కన్నీరుపెట్టుకోవడం కనిపించింది. శోభానాగిరెడ్డి దాదాపు మూడు దశాబ్దాలుగా అధునాతన వాహనాలతో ఈ రహదారిపై పర్యటించేవారని, ఆమెతోపాటు ఆమె డ్రైవర్లకు కూడా రహదారిపై సంపూర్ణ అవగాహన ఉందని, అటువంటి పరిస్థితుల్లో ప్రమాదం ఎలా జరిగిందన్న ప్రశ్న జనం నుంచి తలెత్తుతోంది.
బోల్తా పడిన సమయంలో వాహనం నుంచి శోభానాగిరెడ్డి మాత్రమే ఎగిరిపడడాన్ని కూడా దురదృష్టంగా చెప్పుకొంటున్నారు. ఉదయం నుంచి వేల సంఖ్యలో సంఘటనా స్థలం మీదుగా వాహనాలు వెళ్లాయని, వారందరికీ ఎదు రు కాని సమస్య ఇదే వాహనానికి ఎదురు కావడం కూడా బాధాకరమని పేర్కొంటున్నారు. శోభానాగిరెడ్డిని లక్ష్యంగా మృత్యు వు వెంటాడినట్లు సంఘటనా స్థలంలోని పరిస్థితులను బట్టి అర్థమవుతోందని, మృత్యువు ఎందుకు ఆమెపై ఇంత పగపట్టిందని ఆవేదన చెందారు. స్థానిక ప్రజలు సైతం ఘటనా స్థలానికి చేరుకొని అక్కా వెళ్లిపోయావా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
భూూమా జోక్యంతో జనం బయటకు..
శోభా పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు వచ్చిన జనంతో భూమా నివాసం కిక్కిరిసిపోయింది. అయితే పార్థీవ దేహం సందర్శించిన వారు బయటకు రాకపోవడంతో జనం వెళ్లడానికి సాధ్యం కాలేదు. పోలీసులు వెళ్లి అదుపు చేయడానికి ప్రయత్నం చేయగా ప్రజలు సహకరించలేదు. సున్నితమైన వ్యవహారం కాబట్టి పోలీసులు కూడా వారిపై ఒత్తిడి తేకుండా భూమానాగిరెడ్డి దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. దీంతో విషాదంలో నుంచి బరువెక్కిన హృదయంతో భూమా బయటకు వచ్చి జనాలను బయటకు రావాలని పదేపదే కోరారు. సాధ్యం కాకపోవడంతో పార్థీవ దేహాన్ని ప్రధాన కూడలికి తెచ్చి ఇబ్బందులను తొలగించారు.