
వైఎస్సార్‌సీపీ జైత్రయాత్ర
ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డికి ఘన నివాళి
ఆళ్లగడ్డ ఎన్నిక చరిత్రలో నిలిచిపోయింది. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన అనంతరం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి శోభా నాగిరెడ్డి మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం తలెత్తింది. రాజ్యంగం ప్రకారం మరణించిన శోభా నాగిరెడ్డికి ఓట్లేస్తే ఆమె గెలిచినట్లేనని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఆళ్లగడ్డ ప్రజలు శోభా నాగిరెడ్డికి ఓట్లు వేసి ఘనమైన నివాళి అర్పించాలని నిర్ణయించుకున్నారు. ఆమె మరణించినా.. జనం మధ్య శోభా నాగిరెడ్డి లేకపోయినా... ఆమెను ప్రజలు తమ నేతగా ఎన్నుకోవడం విశేషం.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక వరుస ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ 8 స్థానాలను గెలుపొందగా.. టీడీపీ మూడింటితో సరిపెట్టుకుంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ 30 స్థానాలను దక్కించుకుని జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకుంది.
ఎంపీటీసీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఇక శుక్రవారం వెలువడిన అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రెండు పార్లమెంట్, 11 అసెంబ్లీ స్థానాల్లో తిరుగులేని విజయం కట్టబెట్టారు. టీడీపీ మూడు అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకోగా.. కాంగ్రెస్ పార్టీ మట్టికరిచింది. కోట్ల కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న కర్నూలులో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ఎక్కడా ఒక్క స్థానంలోనూ ఓటర్లను ప్రభావితం చేయలేకపోయింది.
అదేవిధంగా మున్సిపాలిటీ.. ప్రాదేశిక పోరులోనూ కర్నూలు జిల్లా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే అత్యధిక స్థానాలను కట్టబెట్టి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీలకు శుక్రవారం చేపట్టిన ఓట్ల లెక్కింపులో కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆదోని, ఆలూరు, శ్రీశైలం, కోడుమూరు, నందికొట్కూరు, డోన్, మంత్రాలయం, పాణ్యం అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. బనగానపల్లి, ఎమ్మిగనూరు, పత్తికొండ అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. కర్నూలు, నంద్యాల పార్లమెంట్ స్థానాలు రెండింటినీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కాంగ్రెస్, టీడీపీలను ప్రజలు నమ్మలేదనే విషయం ఈ ఫలితాలతో తేలిపోయింది. టీడీపీ హామీలు, నరేంద్రమోడి చరిష్మా కర్నూలు జిల్లా ప్రజలను ప్రభావితం చేయలేకపోయాయి. టీడీపీ గెలుపొందిన మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్ నాయకులతో రహస్య ఒప్పందాలు చేసుకోవటంతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు తెలుస్తోంది.
కర్నూలులో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు... ద్వితీయ స్థానానికే పరిమితమైన టీడీపీ
జిల్లాలో కాంగ్రెస్ చిరునామా గల్లంతైతే.. టీడీపీ రెండో స్థానానికే పరిమితమైంది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో మొత్తం 14,81,190 ఓట్లు ఉంటే.. 10,62,242 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 4,68,358 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 4,24,380 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,15,772 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా నంద్యాల పార్లమెంట్ స్థానంలో మొత్తం 15,75,677 ఓట్లలో 11,95,733 ఓట్లు పోలయ్యాయి.
ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 6,20,482, టీడీపీకి 5,14,189, కాంగ్రెస్‌కు 1,21,261 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న కర్నూలు జిల్లాలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతైంది. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించిన కర్నూలు పార్లమెంట్‌లో ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. సొంత నియోజకవర్గం కోడుమూరులోనూ ఆయన మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఇకపోతే 14 అసెంబ్లీల్లోని 30,56,867 ఓట్లలో 22,57,975 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 10,28,056.. టీడీపీకి 9,08,199.. కాంగ్రెస్‌కు మొక్కుబడి ఓట్లు పోలయ్యాయి.
కోడుమూరులో
బీజేపీకి హ్యాండిచ్చిన టీడీపీ
బీజేపీ హవాతో ఓట్లను రాబట్టుకున్న టీడీపీ కోడుమూరులో కమలం అభ్యర్థికి హ్యాండిచ్చింది. పొత్తులో భాగంగా కోడుమూరు అసెంబ్లీలో టీడీపీ.. బీజేపీకి మద్దతివ్వాల్సి ఉంది. అయితే ఇక్కడున్న టీడీపీ నేతలెవ్వరూ బీజేపీ అభ్యర్థి రేణుకమ్మకు సాయం చేయలేదనే చర్చ జరుగుతోంది. కేవలం ఆమెకున్న పరిచయాలు, బంధుత్వాల నుంచే 30 వేల పైచిలుకు ఓట్లను రాబట్టుకోగలిగారు. ఇక్కడ టీడీపీ నేతలు బీజేపీకి సహకరించి ఉంటే ఓట్లు పెరిగేవని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.