బాలకృష్ణ వాహనాన్ని అడ్డుకున్న గలిబిపల్లి ప్రజలు
హిందూపురం/లేపాక్షి: ఎన్నికల తర్వాత మొదటిసారి తన నియోజకవర్గంలో అడుగుపెట్టిన అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. లేపాక్షి మండలం గలిబిపల్లి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆయన కారును అడ్డుకున్నారు. భూమి పూజ చేసి మూడేళ్లయినా తమ ఊరికి రోడ్డు ఎందుకు వేయించలేదంటూ బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. హిందూపురం–చిలమత్తూరు మెయిన్‌రోడ్ నుంచి రూ.70 లక్షల వ్యయంతో గలిబిపల్లికి రోడ్ వేయడానికి మూడేళ్ల కిందట భూమి పూజ చేశారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ఏడాది కిందట రోడ్ వేస్తున్నట్లు హడావుడి చేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు గురువారం మెయిన్ రోడ్‌పై బైఠాయించి.. ఆయన కారును అడ్డుకున్నారు.
మూడేళ్లయినా తమ ఊరికి రోడ్డు ఎందుకు వేయించలేకపోయావో చెప్పాలంటూ నిలదీశారు. వర్షం వచ్చినప్పుడల్లా నరకయాతన పడుతున్నామని.. బైక్‌ల మీద నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలవుతున్నామని వాపోయారు. ఇంతలో టీడీపీ నాయకులు కల్పించుకుని అప్పట్లో కోడ్ రావడంతో పనులు జరగలేదని, ఇప్పుడేమో ప్రభుత్వం మారిపోయిందని చెప్పడంతో.. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా ఇవే సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ స్పందిస్తూ, అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు వేయిస్తానని చెప్పినా.. గ్రామస్తులు వెనక్కితగ్గలేదు. విధిలేని పరిస్థితిలో వారిని తప్పించుకుంటూ బాలకృష్ణ కారు ముందుకు వెళ్లిపోయింది. దీంతో గ్రామస్తులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment