సాక్షి, విజయవాడ : ప్రభుత్వ భూముల్లో నివసించే పేదలకు ఒక చక్కని శుభవార్త అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఏఎండీ. ఇంతియాజ్ చెప్పారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఇళ్ల స్థలాల పంపిణీ, భూసేకరణ తదితర అంశాలను అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇంటి స్థలాన్ని క్రమబద్దీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేదలకు సూచించారు.
దారిద్రరేఖకు దిగువన జీవిస్తున్న పేదలు ప్రభుత్వ భూముల్లో నివాసం ఉండేవారు 100 చదరపు గజాలలోపు నివాసం ఉంటే వాటిని క్రమబద్దీకరణకు రూ. 1 చెల్లించాలన్నారు. 300 చదరపు గజాల కంటే ఎక్కవ ప్రభుత్వ స్థలంలో నివాసం ఉన్న వారికి తమ నివాస స్థలాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్ణయించిన ధరను చెల్లించి తమ స్థలాలను క్రమబద్దీకరించుకోవచ్చన్నారు.
అభ్యంతరం లేని ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న పేదలు వారి ఇంటి క్రమబద్దీకరణ కోసం తహసీల్దార్, గ్రామ సచివాలయాల్లో తమ దరఖాస్తులు దాఖలు చేయాలన్నారు. దీనికి సంబంధించి ఈనెల 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని చెప్పారు. ఈ సదవకాశాన్ని పేదలందరు వినియోగించుకునేలా రెవెన్యూ అధికారులు గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి 120 రోజుల్లోగా నిబంధనల మేరకు అర్హత కల్గిన పేదల స్థలాలను క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటారన్నారు.
జిల్లాలో 2,71లక్షల మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం అర్హులుగా గుర్తించామన్నారు. ఇందుకోసం 4,497 ఎకరాలు భూమి అవసరమని, ప్రస్తుతం 2,132 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందన్నారు. మిగిలిన ప్రవేటు భూమిని త్వరితగతిన భూసేకరణ చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఇళ్ల స్తలాల పంపిణీకి సంబందించి ఈనెల 16వ తేదీన అన్ని మండలాల్లోను సోషల్ అడిట్ నిర్వహించి లబి్ధదారుల జాబితాపై చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, సబ్–కలెక్టర్లు స్వప్నిల్ దినకర్, హెచ్.ఎం. ధ్యానచంద్ర, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చక్రపాణి, ఆర్డీఓలు ఖాజావలి, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment