‘సర్వజన’ కష్టాలు
అనంతపురం మెడికల్ : ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే ఆర్థిక స్థోమత లేక ప్రాణాలు కాపాడుకోవాలని నగరంలోని ప్రభుత్వం సర్వజనాస్పత్రికి వస్తే ఇక్కడి వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పేరుకు పెద్దాస్పత్రి అయినా రోగుల సంక్షే మం గురించి పట్టించుకునే వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఆస్పత్రిలో కొందరు వైద్యులు ‘టైంపాస్’ చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఓపీ ప్రారంభమైతే 10 గంటలైనా రారు. వచ్చినా తాము వైద్యం చేసే గదుల్లో మాత్రం ఉండడం లేదు.
దీంతో చాలా మంది రోగులకు ‘నిరీక్షణ’ తప్పడం లేదు. మధ్నాహం 12 గంటల వరకు ఓపీలో ఉండాల్సి ఉన్నా కొందరు వైద్యులు అర గంట ముందే వెళ్లిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మంగళవారం కంటి చికిత్స చేసే వార్డులో కూడా వైద్యులు పత్తాలేకుండాపోయారు. దీంతో వైద్యం కోసం వచ్చిన వారు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇలాంటి దృశ్యాలు చాలా వార్డుల్లో కన్పించాయి.తాడిమర్రి మండలం రామాపురానికి చెందిన సూర్యకాంతం (45) అనారోగ్య కారణంతో మనస్తాపానికిగురై ఆదివారం విషపు ద్రావకం తాగి అస్వస్థతకు గురైంది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. రెండ్రోజుల పాటు ఎమర్జెన్సీ చికిత్స అనంతరం మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు ఎఫ్‌ఎం వార్డుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అక్కడ స్ట్రచర్ లేదు.. వీల్‌చైరూ లేదు.. కనీసం బాధితురాలిని వార్డు వరకు తీసుకెళ్లేందుకు సిబ్బంది కూడా లేరు. దీంతో కొడుకు చంద్రశేఖర్ సెలైన్ బాటిల్ పట్టుకోగా.. అన్న కొడుకు కేశవ ఆమెను పట్టుకుని వార్డు వరకు (పైఅంతస్తు) వరకు తీసుకొచ్చారు. అక్కడ కూడా నిర్లక్ష్యమే. బాధితురాలికి ఓ మంచం కేటాయించారు. అయితే బాధితురాలికి సెలైన్ బాటిల్ పెట్టడానికి స్టాండ్ లేదు. దీంతో కొడుకే బాటిల్‌ను పక్కనే ఉన్న కిటికీకి కట్టాడు. అనంతపురం సర్వజనాస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు పడుతున్న బాధల్లో ఈ ఘటన ఓ మచ్చుతునక మాత్రమే.