
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 2015–18 స్థాయికి సవరిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెట్రోల్‌పై రూ.1.24, డీజిల్‌పై 93 పైసల చొప్పున వ్యాట్‌ను పెంచింది. పెట్రోల్‌పై 31 శాతం పన్నుతో పాటు అదనంగా రూ.4, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా రూ.4 సుంకం విధించింది. కోవిడ్ కారణంగా ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
► లాక్‌డౌన్ వల్ల ఆదాయాలు భారీగా పడిపోవడంతో చాలా రాష్ట్రాలు పన్నులు పెంచాయి. అదే బాటలో ఇక్కడ కూడా ధరలు సవరించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు పన్ను రేట్లు పెంచాయి.
► లాక్‌డౌన్ వల్ల ఏప్రిల్‌లో రాష్ట్రానికి రూ.4,480 కోట్ల సొంత ఆదాయం రావాల్సి ఉండగా.. కేవలం రూ.1,323 కోట్లు మాత్రమే వచ్చింది. ఇదే పరిస్థితి మే, జూన్ నెలల్లోనూ కొనసాగింది.
► ఆదాయం తగ్గినా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి వైద్యం, సంక్షేమం పథకాల పరంగా పెద్దఎత్తున నిధులను వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్దఎత్తున ప్రశంసలు వచ్చాయి.
► ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో 2015–18 స్థాయికి దాటకుండా పెట్రోల్, డీజిల్‌పై పన్ను రేట్లు సవరించినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సవరించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.