మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఫైలిన్ తుపాను తీరం చేరకముందే జిల్లాలో ఇద్దరిని బలిగొంది. మరో బాలిక వాగులో కొట్టుకుపోయి గల్లంతైంది. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు జిల్లాలోని కుంపిణీవాగు, కొండవాగు, బుడమేరు, పోతులవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేటకు చెందిన కరేటి శైలజ (15), నక్కనబోయిన పావని (14) గురువారం కుంపిణీ వాగులో గల్లంతవగా శైలజ శవమై తేలింది. ముసునూరు మండలం యల్లాపురానికి పుట్టింటికి వచ్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో తమ్మిలేరు దాటేందుకు ప్రయత్నించిన కంభంపాటి శాంతమ్మ (46) నీటి ఉధృతికి కొట్టుకుపోగా ఆమె మృతదేహం బలివే వద్ద దొరికింది.
నేటినుంచి మరింత ఉధృతం
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారి విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి తుపాను ప్రభావం మరింత ఉధృతమవుతుందని వారు తెలిపారు. కోస్తా ప్రాంతంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది.
40 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం
తుపాను ప్రభావంతో బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వీరులపాడులో 126, అత్యల్పంగా నాగాయలంకలో 0.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో నందిగామ, మైలవరం తదితర ప్రాంతాల్లో పూత, పిందె దశలో ఉన్న పత్తి పైరు దెబ్బతిందని రైతులు చెబుతున్నారు. తుపాను విపత్తును తట్టుకునేందుకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మచిలీపట్నం, నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, అవనిగడ్డ, మోపిదేవి మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. వీరితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, జిల్లా ప్రత్యేకాధికారి బీఆర్ మీనా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు. తుపాను ప్రభావంతో మంగినపూడి బీచ్‌లోకి పర్యాటకులను గురువారం నుంచి అనుమతించటం లేదు.
సముద్రంలోనే 40 బోట్లు...
నాలుగైదు రోజుల క్రితం సముద్రంలోకి గిలకలదిండి హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 40 బోట్లను వెంటనే తిరిగి వచ్చేయాలని మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క బోటులో ఎనిమిది మంది చొప్పున ఉన్నారని వివరించారు. శుక్రవారానికి ఈ బోట్లు గిలకలదిండి హార్బర్‌కు చేరే అవకాశముంది.
పొంగి ప్రవహిస్తున్న వాగులు...
బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పశ్చిమకృష్ణాలో కొండవాగు, బుడమేరు, పోతులవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. జి.కొండూరు సమీపంలోని వెలగలేరు వద్ద బుడమేరులో ఇవి కలుస్తాయి. ఇటీవల కాలంలో ఇక్కడి హెడ్ రెగ్యులరేటర్లకు గేట్లు అమర్చారు. పది అడుగుల మేర నీటి మట్టం ఇక్కడకు చేరితే ప్రమాద స్థాయికి చేరినట్లని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎనిమిది అడుగుల మేర నీటి మట్టం ఉందని, మరిన్ని వర్షాలు కురిసి వరద ఉధృతి పెరిగితే రెగ్యులేటర్ గేట్లు తెరవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
ఈ గేట్లు తెరిస్తే వెలగలేరు సమీపంలో రైలు కట్టకు దిగువన ఉన్న కొత్తూరు తాడేపల్లి, సింగ్‌నగర్, పాయకాపురంలలోకి వరదనీరు ప్రవేశించే అవకాశం ఉంది. ముసునూరు మండలంలో ఉన్న రామిలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నందిగామ ప్రాంతంలో ఉన్న మున్నేరువాగులోకి వరదనీటి రాక అధికమైంది. తుపాను ప్రభావంతో మరింత వర్షం కురిస్తే ఈ వాగులు ప్రమాదస్థాయిని మించి ప్రవహించే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.
ప్రత్యేక అధికారుల నియామకం...
జిల్లాలో తుపాను ప్రబావిత ప్రాంతాలకు ప్రత్యేకాధికారులను కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి నియమించారు. మచిలీపట్నానికి జెడ్పీ సీఈవో, మత్స్యశాఖ ఏడీలను, నాగాయలంకకు మత్స్యశాఖ డీడీ, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారిలను, కోడూరుకు సాంఘిక సంక్షేమశాఖ జేడీ, డీఆర్డీఏ పీడీలను, కృత్తివెన్నుకు డ్వామా పీడీ, విజయవాడ మత్స్యశాఖ ఏడీలను, బంటుమిల్లికి ఎస్సీ సొసైటీ ఈడీని, అవనిగడ్డకు జిల్లా సహకార శాఖాధికారిని, మోపిదేవికి రాజీవ్ విద్యామిషన్ పీవో నియమితులయ్యారు.
వీరితో పాటు భారీ వర్షాలు కురిసి విపత్కర పరిస్థితులు ఏర్పడితే ప్రజలను కాపాడేందుకు జగ్గయ్యపేటకు మెప్మా పీడీని, చందర్లపాడుకు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డెరైక్టర్‌ను, కంచికచర్లకు వ్యవసాయశాఖ జేడీని, ఇబ్రహీంపట్నానికి డీపీవోను, విజయవాడ అర్బన్‌కు అటవీ అధికారిని, విజయవాడ రూరల్‌కు వీజీటీఎం ఉడా అధికారిని, పెనమలూరుకు జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారిని, కంకిపాడుకు పరిశ్రమల శాఖ జీఎంను, తోట్లవల్లూరుకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేకాధికారిని, పమిడిముక్కలకు కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్‌ను, ఘంటసాలకు చేనేత, జౌళిశాఖ ఏడీని, చల్లపల్లికి గృహనిర్మాణ సంస్థ పీడీని నియమించారు.
‘ఫైలిన్’మరింత ఉధృతం: వాగుల్లో ఇద్దరి మృతి
Published Fri, Oct 11 2013 1:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM
Advertisement
Advertisement