
మాట వినలేదో..
జైలు నుంచే ‘ఎర్ర’ దొంగల బెదిరింపులు..
ఫోన్లలోనే రియల్ ఎస్టేట్ పంచాయితీలు
రాయచోటి సబ్‌జైలు కేంద్రంగా నడుస్తున్న అక్రమదందా
సిబ్బంది సహకారంతోనే సెటిల్‌మెంట్లు
కడప: అన్న చెప్పినాడు... నువ్వు రామయ్యకు ఇవ్వాల్సిన మొత్తం వెనక్కు ఇవ్వు.. లేదంటే నీఇష్టం. కావాలంటే ఇదో అన్నతో మాట్లాడు. ఏం గోపయ్య నీస్థలం సుబ్బయ్య కొన్నాడంట కదా, అతను ఇచ్చిన మొత్తం మేరకు రిజిష్టర్ చేయించు, అగ్రిమెంటు షరతులంటే కుదరదు. ఎక్కడి నుంచి తెస్తాడు, అన్న చెప్పాడు... సమస్యలు సృష్టించకుండా చెప్పినట్లు విను.
ఇందంతా ఏదో సినిమాలోని కథలా ఉంది కదూ. నిత్యం ఇలాంటి తంతు ఇటీవల రాయచోటిలో అధికమైంది. సబ్‌జైలు నుంచే ఆ ఇరువురు చక్రం తిప్పుతున్నారు. అందుకు యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తోంది. అధికారం అండగా ఉంటే ఇళ్లు అయితేనేం, జైలు అయితేనేం అని ఆ ఇరువురు నిరూపిస్తున్నారు. షటిల్‌మెంట్లు అక్రమదందాలల్లో ఎర్ర‘దొంగలు’ బిజీగా గడుపుతున్నారు. రాయచోటి పట్టణంలో వారు చెప్పిందే వేదంగా నిలుస్తోంది. ఫోన్లలో వారు శాసిస్తే అనుచరులు పాటిస్తున్నారు. వెరసి రాయచోటి సబ్‌జైలు నుంచే పంచాయితీలు, షటిల్‌మెంట్లు జోరుగా సాగుతున్నాయి. అందుకు సహకరిస్తోన్న సిబ్బందికి కాసుల పంట పండుతోంది.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ ఇరువురు అక్రమ కార్యకలాపాలకు హద్దు ఉండదని అందరూ ఊహించారు. ‘ముందే కోతి ఆపై కల్లు తాగింది’ అన్నట్లుగా ఎర్రచందనం స్మగ్లర్లుగా కీర్తిగడించిన ఆ ఇరువురికి ఊహించని విధంగా బ్రేకులు పడ్డాయి. అనూహ్యంగా చిత్తూరు జిల్లా పోలీసులు పీడీ యాక్టు ప్రయోగించి జైలుకు పంపారు. అయితే పీడీ యాక్టును ఎత్తివేయాలని ప్రభుత్వ పరిధిలో పలువిధాలుగా ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా పీడీ యాక్టు వైదొలుగుతోందని అనుచరులు ఆశించారు. ఆప్రయత్నం విఫలమైంది. కోర్టు ఆశ్రయం పొందినా ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోయింది. వ్యూహత్మకంగా చట్టాన్ని ఆసరాగా చేసుకొని రాయచోటి సబ్‌జైలులో తిష్టవేశారు. ఆపై అక్రమదందాకు పాల్పడుతోన్నట్లు సమాచారం.
జోరుగా బెదిరింపులు...షటిల్‌మెంట్లు...
రాయచోటి సబ్‌జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్న ఆ ఇరువురు పట్టణంలో శాశిస్తున్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో వైఫల్యాల కారణంగా ఆ ఇరువురు బిజీగా మారినట్లు సమాచారం. రాజమండ్రి జైలుకు పీడీ యాక్టు కింద వెళ్లిన ఆ ఇరువురు పలు కేసుల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. ఆమేరకు స్థానిక పోలీసులు చేసుకున్న దరఖాస్తు కారణంగా రాయచోటి సబ్‌జైలుకు వచ్చారు. అయితే జైలు సిబ్బంది సంపూర్ణ సహకారం కారణంగా ఆ ఇరువురు ‘మూడు షటిల్‌మెంట్లు ఆరు పంచాయితీలు’గా విరాజిల్లుతోన్నారు. సబ్‌జైలులో యధేచ్ఛగా సెల్‌లో మాట్లాడుతూ అనుచరుల్ని రంగంలోకి దింపి పంచాయితీలు నిర్వహిస్తున్నారు. ఆ ఇరువురి నేర చరిత్ర తెలిసిన పట్టణవాసులు భయంతో వారు చెప్పినట్లు చేస్తున్నారు. రాజమండ్రిలో ఉండాల్సిన వారు రాయచోటికి వచ్చారు, రేపోమాపో జైలు నుంచి వస్తే చెప్పినట్లు వినలేదని వారు చేసే రచ్చకంటే అనుకూలంగా ఉండడమే శ్రేయష్కరమని పలువురు భావిస్తున్నారు.
తనిఖీలు చేయమని ఆదేశించాను: జిల్లా సబ్‌జైళ్ల అధికారి కృష్ణమూర్తి
రాయచోటి సబ్‌జైల్లోని రిమాండ్ ఖైదీలు సెల్‌ఫోన్ వాడుతున్నట్లు ఇప్పటి వరకూ నా దృష్టికి రాలేదు. వెంటనే తనిఖీలు చేయాల్సిందిగా అక్కడి అధికార్ని ఆదేశిస్తాను. సెలవులో ఉన్నాను, రాగానే స్వయంగా వెళ్లి తనిఖీ చేస్తానని జిల్లా జైళ్లు అధికారి కృష్ణమూర్తి ఫోన్‌లో సాక్షి ప్రతినిధికి తెలిపారు.