
కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన వైఎస్ జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదని తెలిపారు.
తొలి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకపోతే ప్రభుత్వాలు, రాజకీయాలపైన విశ్వాసం సన్నగిల్లిపోతుందని సీఎం జగన్ చెప్పెవారని గుర్తుచేశారు. టీడీపీలా మేము 640 హామీలు ఇచ్చి పదో పదిహేనో అమలు చేసి మిగతా వాటిని గాలికి వదిలేయలేదని విమర్శించారు. చేయగలిగే తొమ్మిది నవరత్నాలను వైఎస్ జగన్ ప్రకటించి అమలు చేశారని అన్నారు. కేవలం నవరత్నాలే కాకుండా ఇంకా కొన్ని పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలను పొందారని అన్నారు.
ఒకవైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమ పధకాలను సమాంతరంగా నిర్వర్తిస్తున్నారని అన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం మాకు రూ. 40 వేల కోట్లు బకాయిలు, రూ.3 లక్షల కోట్లు అప్పులు ఇచ్చిందని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారగానే దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున బకాయిలు పెట్టలేదని విమర్శించారు. ఇలాంటి తరుణంలో సీఎం జగన్ అద్బుతమైన ఆర్ధిక పాలనను అందిస్తున్నారని తెలిపారు.
వైఎస్సార్‌కు హై కమాండ్ పెత్తనం ఉండేదని.. అయినా దివంగత నేత వైఎస్ఆర్ నిరంతరం పేదల గురించే ఆలోచించేవారని తెలిపారు. ఆయన ఆలొచనలో సిఎం జగన్ ఇంకో అడుగు ముందుకు వేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్ లాంటి సంక్షేమ పధకాలు వైఎస్ఆర్ మానస పుత్రికలని.. ఆ రెండు పథకాలే ఇవాళ మా పార్టీకి బంగారు ఫ్లాట్ ఫామ్ వేశాయని అన్నారు. పేద ప్రజలకు చేయందించి వారి కన్నీరు తుడవగలిగిన వారే పరిపాలకులుగా ఉండాలని సీఎం జగన్ తన పాలన తీరుతో చూపించారని పేర్కొన్నారు.