రోల్‌మోడల్‌గా ‘ఆరోగ్యశ్రీ’ | Planning Of YSR Arogyasree Scheme Is a Role Model | Sakshi
Sakshi News home page

రోల్‌మోడల్‌గా ‘ఆరోగ్యశ్రీ’

Published Fri, Jul 26 2019 3:31 AM | Last Updated on Fri, Jul 26 2019 8:23 AM

Planning Of YSR Arogyasree Scheme Is a Role Model  - Sakshi

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలుచేయాలని నిపుణుల కమిటీ నిర్ణయించింది.

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని పకడ్బందీగా అమలుచేయాలని నిపుణుల కమిటీ నిర్ణయించింది. బిల్లు వెయ్యి రూపాయలు దాటితే దాన్ని ఆరోగ్యశ్రీ కిందకు తేవాలని సీఎం హామీ ఇచ్చినందున ఈ పథకం రూపకల్పనకు అనుకరించాల్సిన నమూనాలు దేశంలో ఎక్కడా లేవని.. ఏ దేశంలోనూ ఇలాంటి పథకాల్లేనందున మనమే అన్ని వ్యూహాలు సిద్ధంచేసుకుని ఈ దీనిని ఓ రోల్‌మోడల్‌గా తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలవాలని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యశాఖలో సంస్కరణల కోసం ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీకి అధ్యక్షురాలైన సుజాతారావు నేతృత్వంలో గురువారం ఈ అంశంపై సమావేశం సుదీర్ఘంగా జరిగింది.

ఈ సందర్భంగా వివిధ ప్రైవేటు ఆస్పత్రులు, నిపుణులు, ఇతర రాష్ట్రాల ప్రతినిధుల అభిప్రాయాలను సమావేశంలో తీసుకున్నారు. వెయ్యి రూపాయలు బిల్లు దాటిన కేసులన్నీ పథకంలో చేర్చాలంటే ముందుగా రెండు రెవెన్యూ డివిజన్లలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలుచేసి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తే బావుంటుందని నిర్ణయించారు. ఏ జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టును అమలుచేయాలో నిర్ణయించి ప్రభుత్వానికి ప్రతిపాది స్తామన్నారు. దీనికోసం ఒక సాంకేతిక నిపుణుల కమిటీని నియమించాలని కూడా కమిటీ నిర్ణయించింది. ప్రస్తుతం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు పరిధిలోని ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్‌) మినహా వివిధ వర్గాలకు వర్తించే వైద్య బీమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్న దానిపై సమావేశంలో చర్చ జరిగింది. అలాగే, ప్రస్తుతం అమలులో ఉన్న వర్కింగ్‌ జర్నలిస్టుల హెల్త్‌ స్కీంలో రూ.2 లక్షల పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని సభ్యుడు డాక్టర్‌ దుట్టా రామచంద్రరావు చేసిన సూచనను కమిటీ ఆమోదించింది. 

తొందరపాటు వద్దు..
ఇదిలా ఉంటే.. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆదరాబాదరాగా కాకుండా అన్ని కోణాల్లోనూ ఆలోచించి పకడ్బందీగా అమలుచేయాలని.. ఒకసారి ప్రారంభమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదన్న ముందుచూపుతో అడుగులు వేయాలని అధికారులకు సుజాతారావు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆలోచన మేరకు తాము ప్రభుత్వానికి సహకరించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని, ఇది మంచి కార్యక్రమం కాబట్టి కలిసి పనిచేస్తామని ఏపీ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ (అప్నా), ఏపీ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రతినిధులు హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నచిన్న ఆసుపత్రుల్ని కూడా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల పరిధిలోకి తీసుకురావాలని అప్నా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శివప్రసాద్‌ సూచించారు. అలాగే, కేరళకు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ రాజీవ్‌ సదానందన్‌ మాట్లాడుతూ.. గతంలోని రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో నిర్దేశిత రోగాలకే చికిత్స ఉండేదని.. ప్రస్తుత వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో అలా లేకపోవడం అభినందించదగ్గ విషయమన్నారు. 

కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రులు
వార్షిక ఆదాయం రూ.5 లక్షలు దాటని అన్ని వర్గాల వారికీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తింపు, ఎన్ని లక్షలు ఖర్చయినా పూర్తిగా ఉచిత వైద్యం.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో చికిత్స చేయించుకున్నా పథకం వర్తింపు.. ఆపరేషన్‌ లేదా జబ్బుచేసిన వ్యక్తికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం.. రెండేళ్లలోగా కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్ని తీర్చిదిద్దడం వంటి అంశాలపై కూడా నిపుణుల కమిటీ చర్చించింది. ప్రతి చిన్నదానికీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆసుపత్రులకు వెళ్లకుండా కొన్ని స్పెషలిస్ట్‌ చికిత్సల కోసమే వెళ్లేలా మార్గదర్శకాలను తీసుకొస్తే బాగుంటుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని పీహెచ్‌సీలను బలోపేతం చేస్తే తప్ప భవిష్యత్తులో ఆశించిన మేర సేవలందించలేరని పలువురు సభ్యులు వివరించారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి,  చెన్నై ఐఐటికి చెందిన ప్రొ.విఆర్‌ మురళీధరన్, హెల్త్‌ ఎకనమిస్ట్‌ డాక్టర్‌ శంకర్‌ ప్రింజా, సీఎంఓ స్పెషల్‌ ఆఫీసర్‌ (ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌) డాక్టర్‌ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement